Advertisement
తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని పార్టీ పెట్టారు షర్మిల. అసలు.. ఆ రాజ్యమే వద్దనుకుని ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని అంటున్నారు గులాబీ నేతలు. బీజేపీ ఆడిస్తున్నట్లు ఆడుతున్నారని ఆమెను లెక్కలో నుంచి తీసేస్తున్నారు. కానీ, అదే పనిగా షర్మిలపై గులాబీ లీడర్లు ఫోకస్ పెడుతుండడంతో ఆమె రేంజ్ అమాంతం పెరిగిపోతోంది. అలాకాదు.. టీఆర్ఎస్ పార్టీనే ఈ రేంజ్ పెంచుతోందనేది కరెక్ట్ గా ఉంటుందనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది.
Advertisement
వైటీపీ స్థాపించిన మొదట్లో ఆ పార్టీలో కాస్త ఉత్సాహమే కనిపించినా, ఆ తరువాత నుంచి వలస వెళ్లే నేతలు పెరిగిపోయారు. కానీ, కొన్నాళ్లకు అంతా సైలెంట్. చేరికలు పూర్తిగా నిలిచిపోవడంతో ఇబ్బందికరంగా మారింది. అయినా షర్మిల మాత్రం తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీకి దింపుతామంటూ ధీమాగా చెబుతున్నారు. అంతేకాదు రాష్ట్రంలో తన పట్టు పెంచుకునేందుకు పాదయాత్ర కూడా చేస్తున్నారు. ఇప్పటికే 3,500 కిలోమీటర్లు పూర్తి చేశారు.
Advertisement
అయితే.. పాదయాత్రలో కేసీఆర్ , ఆయన కుటుంబ సభ్యులనే టార్గెట్ చేస్తూ నిత్యం విమర్శనాస్త్రాలు సంధించారు షర్మిల. మొదట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోనట్టుగానే వ్యవహరించారు. కానీ, రోజులు గడిచేకొద్దీ టీఆర్ఎస్ నాయకులు ఆమెను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కొన్ని చోట్ల పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. కొద్దిరోజుల క్రితం పెట్రోల్ తో దాడి చేయడం సంచలనం రేపింది. ఆ తర్వాత ఆమె ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు చూడడం.. కారులో ఉండగానే క్రేన్ సాయంతో పోలీస్ స్టేషన్ కు తరలించడం.. అరెస్ట్, కోర్టు అంటూ తెగ హడావుడి నడిచింది.
సీన్ కట్ చేస్తే.. షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇలాంటి ప్రతిబంధకాలను సృష్టించడం ద్వారా తెలంగాణ సర్కార్ స్వయంగా షర్మిలను మహా నాయకురాలుగా తీర్చిదిద్దుతోందా? అనే సందేహం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే సమస్య ఎదురైనప్పుడే దాన్ని ధైర్యంగా పోరాడడం చేస్తుంటారు. అదే ఫార్ములాతో కేసీఆర్ పెడుతున్న ఆంక్షలను క్యాష్ చేసుకుంటూ నిత్యం వార్తల్లో ఉండేలా హైలైట్ అవుతున్నారు షర్మిల. మొదట్లో అంతగా ప్రభావం లేకపోయినా.. టీఆర్ఎస్ ఆమెపై అతిగా ఫోకస్ పెట్టడం షర్మిలకే ప్లస్ అవుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.