Advertisement
హైదరాబాద్ కుషాయిగూడ అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనమయిన ఘటనపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన నరేశ్(35), అతని భార్య సుమ(35), వారి కుమారుడు జశ్విత్(6) ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసి విచారం వ్యక్తం చేశారు.
Advertisement
నరేశ్ పెద్ద కుమారుడు హాత్విక్ ఒంటరవడంతో నేనున్నానంటూ అండగా నిలబడ్డారు వెంకట్ రెడ్డి. రెడ్డిగూడెం సర్పంచ్ ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణమూర్తి, ఇతర నేతలు, తన PA సైదులును గ్రామానికి పంపించారు. ఆ చిన్నారి పేరు మీద ఫిక్స్ డ్ డిపాజిట్ కోసం లక్ష రూపాయలు అందజేశారు. అలాగే, బాలుడి నాయనమ్మ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసి.. వెంటనే 25 వేల రూపాయలు ఇచ్చారు. హాత్విక్ చదువుకు అయ్యే ఖర్చంతా భరిస్తానని చెప్పారు.
Advertisement
బాలుడి బంధువులతో ఫోన్ లో మాట్లాడారు కోమటిరెడ్డి. ఎంతో బాధలో ఉన్న వారికి నేనున్నాననే ధైర్యం చెప్పారు. కన్న కొడుకు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నరేశ్ తల్లిదండ్రులకు ఇకపై తనలో నరేశ్ ను చూసుకోమని.. ఏ కష్టం వచ్చినా చెప్పాలని వారితో అన్నారు. హాత్విక్ గురించి ఆలోచించవద్దని తన సొంత కొడుకుగా చూసుకుంటానని చెప్పారు. ఈ సందర్భంగా తన కుమారుడిని తలుచుకుకుని భావోద్వేగానికి లోనయ్యారు కోమటిరెడ్డి.
ఆ బాలుడిని టాప్ స్కూల్ లో చదివించే బాధ్యత తనదని.. చదువుకు అయ్యే ఖర్చంతా భరిస్తానని.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని హామీ ఇచ్చారు. హాత్విక్ మేనత్తలు హైదరాబాద్ లో ఉంటారని తెలిసి.. అక్కడే దగ్గరలో హాస్టల్ లో వేసి చదివిస్తానని తెలిపారు. ఈ ఘటన గురించి తెలిసినప్పటి నుంచి తన గుండె తరుక్కుపోతోందని.. ఢిల్లీలో ఉన్న కారణంగా రాలేకపోయానని వారితో చెప్పారు కోమటిరెడ్డి.