Advertisement
అకాల వర్షం రైతన్నకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో వడగండ్లు పడి అనేక పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అన్నదాతలను ఆదుకోవాలనే డిమాండ్ తో సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్ష తలపెట్టారు. ఇందులో భాగంగా నష్టపోయిన రైతుల్ని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Advertisement
అకాల వర్షం వల్ల భువనగిరి పార్లమెంట్ పరిధిలోని తిరుమలగిరి మండలంలో 99 శాతం పంటలు దెబ్బతిన్నాయి. వరి, మిరప, టమాటో, మొక్కజొన్న, ఇతర పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి పంట అయితే.. కొన్నిచోట్ల గింజ కూడా లేకుండా రాలిపోయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రామన్నపేట, కనగల్, తుంగతుర్తి, నూతన్ కల్ సహా పలు మండలాల్లో చేతికొచ్చిన పంటలు నాశనం అయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లానే కాదు, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి.
Advertisement
ప్రభుత్వం దీనిపై త్వరగా చర్యలు తీసుకుని రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. సీఎం కేసీఆర్ కు ఎంపీ కోమటిరెడ్డి ఇప్పటికే లేఖ రాశారు. అయితే.. సర్కార్ వైపు నుంచి ప్రకటనలే తప్ప రైతులకు అందుతున్న సాయం అరకొరగానే ఉందని తెలుసుకుని వెంకట్ రెడ్డి దీక్షకు పూనుకున్నారు. దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ దగ్గరకు ఒక్క అధికారి కూడా రాలేదని వివరించారు.
సూర్యాపేట జిల్లా నెలికొండ తండా, కొక్య తండా, బొల్ల తండా గ్రామాల్లో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు కోమటిరెడ్డి. ఆయా గ్రామాల్లో 400-500 ఎకరాల్లో వరి, మిర్చి, టమాటో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్ రెడ్డి గారితో కలిసి రైతుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా లక్షల్లో పెట్టుబడి పెడితే అకాల వర్షం తమను నిండా ముంచేసిందని రైతులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకుంటుందని చూస్తుంటే.. ఎవరూ తమను సంప్రదించలేదని ఎంపీకి తెలియజేశారు. దీంతో ఆయన వెంటనే సంబంధిత అధికారులకు రైతుల ముందే ఫోన్ చేసి మాట్లాడారు.