Advertisement
కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఎంపీ వెంకట్ రెడ్డి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పేద విద్యార్థుల ఎదుగుదలకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. వారికి ఆర్థిక సాయం చేస్తూ పైకి తీసుకొస్తున్నారు. ఈక్రమంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగులూరు మోడల్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి.
Advertisement
ప్రస్తుతం 38 మంది విద్యార్థులను ఎంబీబీఎస్ చదివిస్తున్నట్లు తెలిపారు. దళిత కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి.. 2004లో వ్యవసాయం చేస్తున్నట్టు టీవీలో వార్త చూసి ఆమె చెల్లెలిని చదివిస్తా అని చెప్పానన్నారు. ఇప్పుడు ఆమె డాక్టర్ చదువు పూర్తి చేసి కార్డియాలిస్ట్ అయిందని తెలిపారు. డబ్బు ఉన్నవారు పేదవారికి సహాయం చేయాలని చెప్పారు.
Advertisement
నల్లగొండ జిల్లాలో అన్ని కాలేజీలు తిరిగానని.. కోటి 20 లక్షలు పెట్టి కళాశాలల్లో అభివృద్ధి పనులు చేయిస్తున్నానని అన్నారు వెంకట రెడ్డి. పదో తరగతిలో 9.5/10 వస్తే తమ ఫౌండేషన్ ద్వారా 10 వేలు, 10/10 వస్తే పై చదువులకు ఐఐఐటి, ఎంబీబీఎస్ కోర్సుల్లో చదివేవారికి ప్రతి ఏటా రూ.25వేలు ఇస్తున్నానని వివరించారు. అన్నిదానాల కన్నా విద్యాదానం గొప్పదని.. చదవాలనే కోరిక ఎవరికున్నా తాను చదివిస్తానని చెప్పారు. పేదరికం చదువుకు అడ్డం కాకూడదని తెలిపారు.
ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు కోమటిరెడ్డి. ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని ఆరోపించారు. పట్టించుకోకుండా గాలికొదిలేసిందని ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని మెచ్చుకోవడం కాదు.. తనకన్నా చిన్న వయసున్న వ్యక్తి.. విద్యా, వైద్యం ఉచితంగా ఇస్తున్నారు.. మరి మీరేం చేస్తున్నారని కేసీఆర్ ను నిలదీశారు. ప్రభుత్వం విద్యా, వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా ఇచ్చినప్పుడే ప్రజల జీవితాలు బాగుపడతాయని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.