Advertisement
పార్లమెంట్ లో 2023 కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దీంతో వరుసగా ఐదోసారి ఆమె లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా చరిత్ర సృష్టించారు. 2019లో మోడీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రి అయిన నిర్మలమ్మ.. అప్పటినుంచి ఏటా బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. గతంలో వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్ ల తర్వాతి స్థానంలో ఈమె చేరిపోయారు.
Advertisement
ప్రజల సంక్షేమానికే తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చెప్పారు నిర్మలా సీతారామన్. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రపంచమంతటా మందగమనం ఉన్నప్పటికీ మన దేశంలో వృద్ధి అంచనా దాదాపు 7 శాతంగా ఉందని చెప్పారు. కరోనా కష్టాల నుంచి వేగంగా తేరుకుంటున్నామని, ఈ ఏడాదితో వాటన్నింటినీ గట్టెక్కుతామని తెలిపారు. ప్రపంచ దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు.
Advertisement
అయితే.. బడ్జెట్ పై ప్రతిపక్ష పార్టీల నేతలు రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ.. కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు ఉపయోగం లేకుండా రూపొందించారని ఆరోపించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం ఊసేలేదన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ మరోసారి విస్మరించిందని మండిపడ్డారు.
విభజన చట్టాన్ని ఆమోదించి పదేళ్లు అవుతున్నా ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు కోమటిరెడ్డి. బడ్జెట్ లో కూడా బీజేపీ రాజకీయమే చేసిందని.. ఎన్నికలున్న రాష్ట్రాలకు వెసులుబాటు ఇచ్చిందని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు అన్యాయం చేసిందని అసహనం వ్యక్తం చేశారు. పన్ను మినహాయింపు సగటు జీవికి నిరాశనే మిగిల్చిందని.. ఏడు ప్రాధాన్యతా రంగాలన్నారు.. అసలు ఉన్న రంగాలను గాలికొదిలేశారని విమర్శించారు. దేశ రైతాంగాన్ని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను నిరుత్సాహపరిచేలా ఈ బడ్జెట్ ఉందన్నారు వెంకట్ రెడ్డి.