Advertisement
ఉన్న ఊరిని, కన్నవారిని, నమ్ముకున్న కుటుంబాన్ని వదిలి దేశం కోసం త్రివిధ దళాల సైనికులు పహారా కాస్తుంటారు. దేశమే తన కుటుంబమని భావిస్తారు. పుట్టిన మట్టికోసం దేనికైనా తెగిస్తారు. అలాంటి గొప్ప సైనికులు వీర మరణం పొందితే.. వారి కుటుంబాలను ఆదుకోవాలి. దేశం కోసం దేహాన్ని వదిలేసే ఆ మహనీయులను అందించిన కుంటుంబాలకు అండగా నిలబడాలి.
Advertisement
అరుణాచల్ ప్రదేశ్ లో భారతీయ సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ ప్రమాదానికి గురై.. ఇద్దరు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం గ్రామానికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భానురెడ్డి ఒకరు. ఆయన మృతి బాధాకరం. వినయ్ భానురెడ్డి భార్య స్పందన ఆర్మీలో డెంటిస్ట్ గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు(హానిక, హారిక). ప్రస్తుతం మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరిలో నివాసం ఉంటున్నారు.
Advertisement
దేశం కోసం విధులు నిర్వహిస్తూ.. ప్రాణాలు విడిచిన వినయ్ భానురెడ్డి కుటుంబసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలని అన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. వీవీబీ రెడ్డి భార్యకు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని.. హైదరాబాద్ లో ఇంటి స్థలంతోపాటు 50 లక్షల ఎగ్స్ గ్రేషియాను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. భువనగిరిలో ప్రభుత్వం తరఫున వీవీబీ రెడ్డి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని కోరిన ఆయన.. ఈ విషయంలో సీఎం చొరవ తీసుకుని ఆ కుటుంబానికి అండగా నిలబడాలన్నారు.
గతంలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని ఆదుకున్నట్టే వీవీబీ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలని సూచించారు కోమటిరెడ్డి. ఆనాడు స్వయంగా సంతోష్ కుటుంబానికి రూ.5కోట్ల నగదు చెక్కును, గ్రూప్-1 స్థాయి ఉద్యోగానికి సంబంధించిన ఉత్తర్వులను కేసీఆర్ అందజేశారని.. జూబ్లీహిల్స్ లో కేటాయించిన ఇంటిస్థలం పత్రాలను కూడా ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భానురెడ్డి భార్య స్పందనకు అపాయింట్ మెంట్ ఇచ్చి ఆమెను కలవాలని కోరారు. ఆ కుటుంబానికి సాయం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.