Advertisement
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. నల్గొండ ఈద్గాలో జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరసోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సచార్ కమిటీ నివేదిక ప్రకారం.. ముస్లింలలో 98 శాతం పేదవాళ్లు ఉన్నారని తెలిసి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చామని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఒప్పుకోకుంటే రిజర్వేషన్ కోసం పోరాడి సాధిచుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు.
Advertisement
12 శాతం రిజర్వేషన్ ఇస్తానని కేసీఆర్ అన్నారని.. ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించారు కోమటిరెడ్డి. కనీసం 8 శాతానికి కూడా పెంచలేదని.. తమిళనాడులో మాదిరిగా పెంచే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. దత్తత అంటూ నల్గొండలో ఒక్క ఇల్లు అయినా కట్టారా? అని ప్రశ్నించారు. అదే, తన హయాంలో నల్గొండ ఈద్గా దగ్గరలో రాజీవ్ గృహకల్ప కింద 300 ఇళ్లు కట్టించానని గుర్తు చేశారు. అంతేకాదు, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.. సొంత జాగా ఉంటే లక్ష రూపాయలు ఇచ్చాం.. కానీ, డబుల్ బెడ్రూం అని చెప్పిన కేసీఆర్ నల్గొండలో దళితులు, ముస్లింలు, పేదవాళ్లను మోసం చేశారని విమర్శించారు.
గజ్వేల్ లో 5వేల ఇళ్లు కట్టించిన కేసీఆర్.. నల్గొండలో ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తండ్రి చనిపోతే వచ్చి మెయిన్ రోడ్ ఒక్కటి వేస్తే సరిపోతుందా? ఆ ఒక్క రోడ్ తో నల్గొండ అభివృద్ధి కాదన్నారు. పేదలకు ఇళ్లు కట్టినప్పుడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. మూడున్నర లక్షల మంది విద్యార్థులు టీఆర్టీ ఎగ్జామ్ కోసం ఎదురుచూస్తున్నారన్న వెంకట్ రెడ్డి.. దాని గురించి కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
Advertisement
బీఆర్ఎస్ ప్రభుత్వానికి నాలుగున్నర నెలల సమయమే ఉందన్న కోమటిరెడ్డి.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. గతంలో సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి లక్ష రూపాయలు ఎలా ఇచ్చామో.. ఈసారి 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. తాను భువనగిరికి ఎంపీనే అయినా.. నల్గొండలో ఎవరికి ఏ కష్టమొచ్చినా అండగా ఉంటున్నానని తెలిపారు. ఈసారి కూడా నల్గొండ నుంచి పోటీ చేస్తానన్నారు. అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని.. ప్రజలకు సంతోషమున్నా, దు:ఖమున్నా వారికి నేనున్నాననే భరోసా కల్పిస్తున్నానని తెలిపారు.
సరైన బాత్రూంలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే.. 15 లక్షలు ఖర్చు చేసి కట్టించానన్నారు కోమటిరెడ్డి. తాను ఎమ్మెల్యే కాకపోయినా ప్రజలకు మంచి చేయాలనేదే తన తాపత్రయమన్నారు. పేదలు బాగుండాలన్నదే తన గుణమని చెప్పారు. దేశంలో అన్ని ధరలు పెరిగిపోతున్నాయని.. గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేశారని మండిపడ్డారు. ప్రధాని మోడీ ఇంటికో ఉద్యోమన్నారు.. 15 లక్షలు ఇస్తానన్నారు.. ఎక్కడా ఉద్యోగాలు లేవు.. 15 లక్షలు ఇచ్చింది లేదని మండిపడ్డారు. వంట గ్యాస్ 15 వందలు చేశారని.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సబ్సిడీ భరిస్తూ 500 రూపాయలకే అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇక సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర భువనగిరి నియోజకవర్గం, అలాగే నల్గొండ మీదుగా ఖమ్మం వెళ్తుందని తెలిపారు వెంకట్ రెడ్డి. ఈ సందర్భంగా నల్గొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సభకు ప్రియాంక గాంధీని తీసుకురావాలని చూస్తున్నట్టు వివరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఆమెకు చెప్పామని.. సానుకూలంగానే ఆమె మాట్లాడారని.. నల్గొండలో ప్రియాంక గాంధీతో సభ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.