Advertisement
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. భువనగిరి ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్. కానీ, సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. తన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎవరిని కలిసినా.. ఆయన్ను తప్పుబడుతున్నారు. అయితే.. నిన్నగాక మొన్నొచ్చిన లీడర్లు, చోటామోటా నేతలు పదేపదే టార్గెట్ చేస్తుండడం ఆయన్ను డిస్టర్బ్ చేస్తోంది. ఈ క్రమంలోనే చెరుకు సుధాకర్ కుమారుడికి ఫోన్ చేసి మాట్లాడారు. తనపై అనవసరంగా విమర్శలు చేయొద్దని.. అభిమానులు ఊరుకోరని అన్నారు. ఈక్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చారు.
Advertisement
నకిరేకల్ కు చెందిన నేత చెప్పరాని భాషతో నన్ను దూషించడం బాధించిందన్నారు. పదేపదే తనను టార్గెట్ చేస్తుండడంతో ఫోన్ చేశానని తెలిపారు. కాప్షన్ కాదు.. బైట్ విన్నారా అని అన్నప్పుడు కాస్త భావోద్వేగానికి గురై మాట్లాడానని వివరించారు. అభివృద్ధే లక్ష్యంగా, పేదల సంక్షేమమే ధ్యేయంగా తాను పని చేస్తున్నానని చెప్పారు. ఇప్పటిదాకా ఎంతో మందికి ఆర్థిక సాయం చేశానని చెప్పారు.
Advertisement
తనది శత్రువులను కూడా దగ్గర తీసే తత్వమన్న కోమటిరెడ్డి.. 33 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రత్యర్థులను దూషించింది లేదని గుర్తు చేశారు. అయినా, తిట్టాలనుకుంటే రెగ్యులర్ ఫోన్ ఎందుకు చేస్తానన్న ఆయన.. కలలో కూడా తాను ఏ కులాన్నీ కించపరచనని వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారికి పదవులు దక్కేలా చేశానని వివరించారు.
ఒకప్పుడు చెరుకు సుధాకర్ పై పీడీ యాక్ట్ పెడితే.. దానికి వ్యతిరేకంగా తాను కొట్లాడానని గుర్తు చేశారు వెంకట్ రెడ్డి. తనను తిట్టొద్దని మాత్రమే ఆయన కుమారుడికి చెప్పానని.. ప్రజలు దీనిని మరోలా అర్థం చేసుకోకూడదనే ఉద్దేశంతోనే క్లారిటీ ఇస్తున్నట్టు తెలిపారు. నకిరేకల్ లో తనకు వ్యతిరేకంగా పోస్టర్లు ఎవరు చేశారో తనకు తెలుసన్నారు. తన అభిమానులు ఏదైనా చేస్తారనే భయంతోనే అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు కోమటిరెడ్డి.