Advertisement
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీ మాత్రమేనన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ ప్రైవేట్ హోటల్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. 2.90 లక్షల కోట్ల బడ్జెట్ అని గొప్పగా చెప్పారని.. గతంలో కూడా ఇలాగే చెప్పి ఎంత ఖర్చు పెట్టారని ప్రశ్నించారు.
Advertisement
ఈ బడ్జెట్ పూర్తిగా ఎన్నికల బడ్జెట్ లా ఉందన్న కోమటిరెడ్డి.. పేదలకు ఎన్ని ఇళ్లు కట్టిస్తామో అనేది చెప్పలేదన్నారు. మిషన్ భగీరథ పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి సొంత ఊరు నాగారంలో తాగడానికి నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. వాళ్ల బాధ చూడలేక మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయిద్దామని తాను చొరవ తీసుకుంటే.. గ్రామస్తులను బెదిరించి మిషన్ భగీరథ పైప్ లైన్ వేయిస్తానని ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
జగదీశ్వర్ రెడ్డి సొంత ఊరులో ఇప్పటికీ నీళ్ల సమస్య ఉందని.. కావాలంటే మీడియా అక్కడికి వెళ్లి చూడొచ్చని చెప్పారు కోమటిరెడ్డి. దీనిపై మంత్రి ఏం సమాధానం చెప్తారని అడిగారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని.. అంకెల గారడీ బడ్జెట్ తో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
13 తర్వాత బైక్ యాత్ర
ఈనెల 13న పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత బైక్ యాత్ర చేస్తున్నట్టు తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో బస్సుయాత్ర గానీ, బైక్ యాత్ర గానీ చేపట్టనున్నట్టు చెప్పారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉందని.. 12 నియోజకవర్గాలలో బైక్ యాత్రను త్వరలోనే ప్రారంభిస్తానని తెలిపారు. ఇటు రేవంత్ యాత్రపైనా స్పందించారు కోమటిరెడ్డి. జనంలో ఉన్నప్పుడు పాదయాత్ర.. తర్వాత బస్సుయాత్ర చేస్తున్నారని అన్నారు. బైక్ యాత్ర ద్వారా ప్రతీ వ్యక్తిని కలిసే వీలుంటుందని అందుకే తాను బైక్ యాత్ర చేపట్టనున్నట్టు వివరించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.