Advertisement
ఇదేంటి హెడ్డింగ్ ఇలా పెట్టారు అని అనుకుంటున్నారా? ఆకాశంలో కనిపించిన రెడ్ మూన్ కి.. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ట్రీట్ కి సంబంధం ఉంది. ప్రపంచవ్యాప్తంగా రెడ్ మూన్ దర్శనమిచ్చింది. మన దగ్గర మాత్రం పాక్షికంగానే కనిపించింది. హైదరాబాద్ లో మధ్యాహ్నం 2.39కు ప్రారంభమై సాయంత్రం 5.12 గంటలకు పూర్తిగా కనిపించింది.
Advertisement
చీకటి పడేసరికి పాక్షిక గ్రహణంతో చంద్రుడు కనిపించాడు. ప్రజలంతా వీక్షించారు. సాయంత్రం 6.19 నిమిషాలకు ఇది ముగిసింది. కొన్ని నగరాల్లో మాత్రం సంపూర్ణంగా కనిపించింది. దీన్ని చూసేందుకు ఎలాంటి పరికరాలు అవసరం లేదని తెలియడంతో జనమంతా భవనాలపైకి ఎక్కారు. ఆసక్తిగా తిలకించారు. పాక్షిక చంద్రగ్రహణాన్ని వీక్షించడంతో పాటు తమ కెమెరాల్లో బంధించారు.
Advertisement
ఇక అసలు విషయానికొస్తే… ఎప్పటిలాగానే మూఢనమ్మకాల చట్ట సాధన సమితి గ్రహణం సందర్భంగా అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టింది. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద గ్రహణ చంద్రునితో సెల్ఫీ విత్ భోజనం కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేసింది. గ్రహణాల పట్ల ప్రజలకు ఉండే భయాందోళనలు, అపోహలు తొలగించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపింది.
జ్యోతిష్యులు చెప్పే మాటలు నమ్మకుండా ఉండడానికి ప్రజలను చైతన్యం చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. గ్రహణం చూడటం వలన, ఆ సమయంలో తినడం వలన ఎలాంటి ఇబ్బందులు రావని జనానికి వివరించారు. కేవలం జ్యోతిష్కులు తమ స్వార్థం కోసం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మూఢనమ్మకాల నిర్మూలన చట్టం సాధన సమితి నిర్వాహకులు చెప్పారు.
మరోవైపు చంద్రగ్రహణం దృష్ట్యా దేశవ్యాప్తంగా ఆలయాలు మూసివేశారు. గ్రహణ కాలం ముగిసిన తర్వాత శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఆ తర్వాత భక్తులకు అనుమతినిచ్చారు.