Advertisement
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హత్ సే హాత్ జోడో యాత్రలో బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడాన్ని కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. రేవంత్ రెడ్డిపై కోడిగుడ్లు, టమాటోలతో దాడి చేయడంపై అభ్యంతరం చెబుతున్నారు. దీనిపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే స్పందించారు. ఈ టన బీఆర్ఎస్ దిక్కుమాలిన పాలనకు మరో నిదర్శనం అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం పట్ల బీఆర్ఎస్ నిర్లక్ష్యానికి ఇది నిరూపణ అన్నారు. భౌతికదాడులు ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించిన ఆయన.. దాడులు చేయడం మంచిది కాదని హితవు పలికారు.
Advertisement
ఇక సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు థాక్రే. ఈ యాత్ర గ్రామగ్రామాన విజయవంతంగా కొనసాగుతోందన్నారు. రాహుల్ గాంధీ సందేశాన్ని, ప్రభుత్వాల వైఫల్యాలను జనాల్లోకి తీసుకు వెళ్తున్నామని తెలిపారు. హాత్ సే హాత్ యాత్ర ప్రతి ఇంటికీ వెళ్లాలన్నదే రాహుల్ ఉద్దేశమని వెల్లడించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో, అభివృద్ధి, సంక్షేమాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు.
Advertisement
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,500 కిలోమీటర్లు రాహుల్ గాంధీ జోడో యాత్ర చేశారని గుర్తు చేశారు థాక్రే. దేశంలోని అన్ని జాతులను ఈ యాత్ర ద్వారా ఏకం చేసి మోడీ సర్కార్ పేద ప్రజలకు చేస్తున్న అన్యాయాలను తెలియచేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గ పరిధిలోనూ బ్లాక్ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి, వాడవాడలో ఇంటింటికీ యాత్ర చేరాలని ఆకాంక్షించారు.
ఇక జానారెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకురావాల్సిన సమయం వచ్చిందని.. కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని వ్యాఖ్యానించారు జానారెడ్డి.