Advertisement
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్న అంశాల్లో ఢిల్లీ లిక్కర్ స్కాం ఒకటి. మరీ ముఖ్యంగా తెలంగాణ మూలాలు ఇందులో ఉండడం.. కేంద్రంపై కేసీఆర్ తిరుగుబాటు ఎగురవేసిన సమయంలోనే టార్గెట్ గా అనిపించడంతో ఎప్పుడేం జరుగుతుందో అనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. ఎందుకంటే.. టీఆర్ఎస్ నేతలతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తులు ఈ కేసులో అరెస్ట్ కావడమే దానికి కారణం. అయితే.. తాజాగా ఈ కేసులో సీబీఐ తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏకంగా 10 వేల పేజీలతో దీన్ని తయారుచేసింది.
Advertisement
ఈ కేసులో నిందితులైన హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అరుణ్ రామచంద్ర పిళ్లై, ముఠా గౌతంలతో పాటు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమీషనర్ కుల్ దీప్ సింగ్, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమీషనర్ నరేంద్ర సింగ్ పేర్లు ఛార్జ్ షీట్ లో ఉన్నాయి. కేసులో మొదటి అరెస్టు నుంచి 60 రోజుల్లోగా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. ఆ గడువు 25తో ముగుస్తుండటంతో ట్రయల్ కోర్టులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఏ1గా కుల్ దీప్ సింగ్, ఏ2గా నరేంద్ర సింగ్, ఏ3గా విజయ్ నాయర్, ఏ4గా అభిషేక్ ఉన్నారు.
Advertisement
ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణను ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది. సీబీఐ దాఖలు చేసిన తొలి ఛార్జ్ షీట్ పై అదే రోజు నిర్ణయం తీసుకోనుంది. అయితే.. ఈ స్కాంలో ప్రధానంగా వినిపించిన పేరు ఢిల్లీ సీఎం సిసోడియా. కానీ, ఛార్జ్ షీట్ లో ఆయన పేరు మాత్రం లేదు. సిసోడియా పేరు లేనంత మాత్రాన.. ఆయన మిస్టర్ క్లీన్ కాదని, దర్యాప్తు కొనసాగుతుందని సీబీఐ అధికారులు అంటున్నారు. కేసులో ఆయనను త్వరలో మళ్ళీ ప్రశ్నిస్తామని వెల్లడించారు. దీన్నిబట్టి తిరిగి ఆయనకు సమన్లు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు సీబీఐ తొలి ఛార్జ్ షీట్ పై సిసోడియా స్పందించారు. తన పేరును చేర్చకపోవడంపై బీజేపీ స్క్రిప్ట్ రాస్తుందని, ఆ ఛార్జ్ షీట్ ను కూడా వారి కార్యాలయాల్లో ఫైల్ చేస్తారని అన్నారు. ఆప్ ప్రభుత్వ నూతన లిక్కర్ పాలసీలో ఎన్నో ఉల్లంఘనలు జరిగాయని, తమకు సన్నిహితులకు, ఇష్టమైన వారికి లైసెన్సులు మంజూరు చేశారని వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈడీ.. మనీలాండరింగ్ కేసు కూడా దాఖలు చేసింది.