Advertisement
తెలంగాణ కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న మర్రి శశిధర్ రెడ్డి ఈమధ్యే హస్తానికి హ్యాండిచ్చారు. పోతూపోతూ రేవంత్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర కాంగ్రెస్ ధీనావస్థ గురించి విమర్శల దాడి చేశారు. అన్నింటి గురించి సవివరంగా సోనియాగాంధీకి లేఖ పంపారు. హస్తానికి గుడ్ బై చెప్పిన మర్రి.. బీజేపీ గూటికి చేరారు. ఢిల్లీలో కేంద్రమంత్రులు శర్బానంద సోనోవాల్, కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీ సభ్యత్వం అందుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మర్రికి బీజేపీ కండువా కప్పి ఆహ్వానించారు.
Advertisement
ఈ సందర్భంగా మాట్లాడిన శశిధర్ రెడ్డి.. మరోసారి కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని ఎద్దేవ చేశారు. టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం చేతకావడం లేదన్నారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణలో అభివృద్ధి నిలిచిపోయిందని, తెలంగాణ కంటే కుటుంబ ప్రయోజనాలకే కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పడం బీజేపీతోనే సాధ్యమవుతుందని, ఇలాంటి ఘట్టంలో భాగస్వామ్యం అవుతున్నందుకు తనకు సంతోషంగా ఉందని తెలిపారు. బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.
Advertisement
బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకొని.. పైకి కొట్లాడుతున్నట్లు నాటకాలు ఆడుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని తిట్టడంపైనే కేసీఆర్ దృష్టి పెట్టారని.. అభివృద్ధి గురించి ఆలోచించడం లేదని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ సర్కార్ భ్రష్టు పట్టిస్తోందని ఆరోపించారు బండి.
ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కాంగ్రెస్ బహిష్కరించింది. ఆ తరువాత రెండు రోజులకే ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ సోనియా గాంధీకి లేఖ రాశారు. మాణిక్కం ఠాగూర్, రేవంత్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఠాగూర్ స్పందించారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. ప్యాకేజీలు పొందే సంస్కృతి కాంగ్రెస్ ది కాదన్నారు. అదే నిజమైతే గతంలో మర్రి ఎన్డీఎం వైస్ చైర్మన్ గా, మంత్రిగా పని చేశారని.. ఆ పదవుల కోసం ఎంతిచ్చారో చెప్పాలని నిలదీశారు.