Advertisement
తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పంచ్ డైలాగులు మామూలుగా పేలడం లేదు. సెటైర్లు, సవాళ్లు, విమర్శలు, ప్రతి విమర్శలతో ఉభయ సభలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. అయితే.. ఈసారి కూడా ప్రతిపక్షాలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అసెంబ్లీని 25 రోజుల పాటు నిర్వహించాలన్న ప్రతిపక్షాల అభ్యర్థనను తోసిపుచ్చింది. 12 వరకే సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Advertisement
సోమవారం(6న) అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది కేసీఆర్ సర్కార్. 7న అసెంబ్లీకి సెలవు ఉండనుంది. తిరిగి 8న బడ్జెట్ పై సభలో సాధారణ చర్చ జరగనుంది. అలాగే 9, 10, 11 మూడు రోజుల పాటు పద్దులపై చర్చ జరగనుంది. 12న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది. ఉన్న ఈ కొద్ది సమయంలో ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని ప్రతిపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈక్రమంలోనే శనివార్ వాడీవేడిగా మాటల యుద్ధం కొనసాగింది. అయితే.. కేటీఆర్ వన్ మ్యాన్ షో మాదిరిగా అనిపించింది.
ముందుగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నడూ లేనిది ఈసారి మాత్రం ఓ రేంజ్ లో ఫైరయ్యారు. పాతబస్తీకి మెట్రో సంగతేంటి? ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఏంటని నిలదీశారు. ఉర్ధూ రెండో భాష అయినా అన్యాయమే జరుగుతోందన్నారు. సీఎం, మంత్రులు మమ్మల్ని కలవనివ్వడం లేదని.. మీరు చెప్రాసీని చూపిస్తే వారినైనా కలుస్తామని వ్యాఖ్యానించారు. అక్బర్ కామెంట్స్ పై కేటీఆర్ ఫైరయ్యారు.
Advertisement
ఏడుగురు సభ్యులున్న పార్టీకి ఎక్కువ సమయం కేటాయించడం సరికాదన్నారు కేటీఆర్. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదని.. మంత్రులు అందుబాటులో లేరనడం కరెక్ట్ కాదని చెప్పారు. తర్వాత మళ్లీ అక్బర్ మాట్లాడారు. తానేమీ కొత్త సభ్యున్ని కాదని, మీకు సహనం తక్కువవుతోందని కామెంట్స్ చేశారు. పొగిడితే మాత్రం ఎంత సేపైనా ఏమీ అనరని వ్యాఖ్యానించారు. దీంతో మంత్రి ప్రశాంత్ రెడ్డి మైక్ అందుకున్నారు. తమకు కోపం రావడం లేదని.. ఒవైసీకే వస్తోందని అన్నారు. ఇంతకుముందు అక్బరుద్దీన్ బాగానే మాట్లాడేవారు.. కానీ ఇప్పుడు ఎందుకు కోపం వస్తుందో అర్ధం కావడం లేదని సెటైర్ వేశారు.
మరోవైపు బీజేపీ నేతలు వర్సెస్ కేటీఆర్ లా వార్ కొనసాగింది. ఎమ్మెల్యేలు రఘునందన్, ఈటల రాజేందర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీంతో కేటీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. కుటుంబ పాలనంటూ వచ్చే విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వానిది కుటుంబ పాలనే అని.. కాకపోతే రాష్ట్రంలోని 4 కోట్ల మంది తమ కుటుంబం అని పేర్కొన్నారు. దేశం మెుత్తం మీద 4 లక్షల ఐటీ ఉద్యోగాలు వస్తే.. మూడో వంతు తెలంగాణలోనే వచ్చాయని వివరించారు. చాక్లెట్ నుంచి రాకెట్ వరకు ప్రతి పరిశ్రమకు గమ్యస్థానం తెలంగాణే అన్న ఆయన.. వరల్డ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్ నిలిచిందని తెలిపారు. ఈ సందర్భంగా మోడీ పాలనలో అంతా నాశనమే అని విమర్శలు గుప్పించారు కేటీఆర్.