Advertisement
యువగళం పేరుతో ఏపీలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు టీడీపీ నేత నారా లోకేష్. వైసీపీ సర్కార్ తీరును ఎండగడుతూ.. సైకో పాలన పోవాలి.. సైకిల్ పాలన రావాలంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అని తేడా లేకుండా వైసీపీకి చెందిన ఎవరినీ వదలకుండా ఓ ఆటాడుకుంటున్నారు. అలా.. మంత్రి రోజాపై ఆయన చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. దీంతో ఆమె రియాక్ట్ అయ్యారు.
Advertisement
అది యువ గళం కాదు ఒంటరి గళం అని సెటైర్లు వేశారు రోజా. లోకేష్ లీడర్ గా వంద శాతం ఫెయిల్యూర్ అని.. అందుకే మంగళగిరి ప్రజలు ఓడించారని గుర్తు చేశారు. తండ్రి ముఖ్యమంత్రిగా, తను మంత్రిగా ఉన్నా కనీసం ఎమ్మెల్యే గా గెలవలేని రికార్డు లోకేష్ దంటూ చురకలంటించారు. అంతేకాదు, లోకేష్ అంకుల్ అంటూ విరుచుకుపడ్డారు. యువగళం ప్రారంభించిన పప్పునాయుడు తన తండ్రి ఈ రాష్ట్రానికి ఏం చేశారో, ఏం చేయబోతున్నారో చెప్పకుండానే నడుస్తున్నారన్నారు.
Advertisement
అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కష్టాలను ముఖ్యమంత్రి జగన్ తీరుస్తున్నారని, ఆ ధైర్యంతోనే మళ్లీ ఓట్లు అడుగుతున్నామన్నారు రోజా. తన తండ్రి మరణించినా ఆత్మస్థైర్యంతో జగన్మోహన్ రెడ్డి ఎవరూ చేయనంత దూరం 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని, ఆ సమయంలోనే ప్రజల కష్టాలను దగ్గరుండి చూశారని, వాటిని ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిష్కరిస్తున్నారని వివరించారు.
తండ్రీకొడుకులు అవసరమైనప్పుడల్లా నందమూరి కుటుంబాన్ని వాడుకొని, అధికారం వచ్చాక విస్మరిస్తున్నారని ఆరోపించారు రోజా. దీన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారని చెప్పారు. లోకేష్ సెక్యూరిటీ, వాలంటీర్లు లేకపోతే పది మంది కూడా పాదయాత్రలో కనిపించరని అన్నారు.