Advertisement
ఏపీలో చాలాచోట్ల రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. ఈ విషయాన్ని జనసేన పార్టీ ప్రజల్లోకి బలంగా తసుకెళ్తోంది. అప్పుడప్పుడు గుంతల పూడ్చివేత కార్యక్రమాలు చేస్తోంది. సోషల్ మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ఆదివారం ఆయన అనంతపురం వెళ్లారు. అక్కడ చెరువుకట్ట రోడ్డును పరిశీలించారు.
Advertisement
స్థానిక రోడ్డు గుంతలమయం కావడంతో మరమ్మతు పనులు చేయాలని నాగబాబు ముందురోజే ప్లాన్ చేసుకున్నారు. అయితే.. ఈ విషయాన్ని గమనించిన అధికారులు ఆగమేఘాల మీద ఆ రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో… పాలన కూడా అలాగే ఉందని విమర్శించారు.
Advertisement
జన సైనికులు రోడ్లు వేస్తామన్నారో.. లేదో.. వైసీపీ ప్రభుత్వం వెంటనే మరమ్మతులు మొదలుపెట్టడం అభినందనీయమన్నారు. ఇటీవలే వైజాగ్ లో తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు నాయకులను అనేక ఇబ్బందులు పెట్టారని.. అయినా పార్టీ చేపట్టిన కార్యక్రమాలు ఏవీ ఆగలేదని వివరించారు. ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
ఇక మంత్రి రోజా గురించి మాట్లాడటం అంటే తమ స్థాయిని తగ్గించుకోవడమేనని నాగబాబు అభిప్రాయపడ్డారు. తమ ప్రచారాన్ని అడ్డుకుంటే.. వారాహిని ఆపితే నడిచి ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు. తాము ప్రస్తుతం బీజేపీతో కలిసే ఉన్నామని తేల్చిచెప్పారు.
మరోవైపు మంత్రి రోజా మరోసారి మెగా ఫ్యామిలీపై హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ది యువశక్తి కాదు ముసలి శక్తి అని ఎద్దేవ చేశారు. గతంలో చిరంజీవి పార్టీ పెట్టి ఆ కులం వాళ్లందరినీ రోడ్డు మీద వదిలేశారని.. మళ్లీ ఇప్పుడు ఆయన తమ్ముడు మరో పార్టీ పెట్టి మరోలా డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ వెనుక ఉండే వారంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. 2019లో టీడీపీ వ్యతిరేక ఓటు చీల్చడానికే పోటీ చేశాడేమోనని అనుమానం వ్యక్తం చేశారు రోజా.