Advertisement
సంచలనం రేపిన లిక్కర్ స్కాం కేసు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మెడకు చుట్టుకుంటోంది. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు కవిత. ఆమె భర్త అనిల్, అడ్వకేట్లను లోపలికి అనుమతివ్వలేదు. వారిని బయటే నిలిపివేశారు పోలీసులు. దీంతో పిడికిలి బిగించి.. కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఒక్కరే ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లారు.
Advertisement
భారీ ర్యాలీగా ఈడీ ఆఫీస్ కు వెళ్లాలని కవిత చూడగా పోలీసులు అనుమతివ్వలేదు. ఆమె కారుతో పాటు మరో కారుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కవిత విచారణ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయం దగ్గరకు బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. దీంతో పోలీసులు ఈడీ ఆఫీస్ పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేసి.. భారీగా బలగాలను మోహరించారు.
Advertisement
మరోవైపు విచారణలో కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 9 మందిని కలిపి ఒకేసారి ప్రశ్నించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియా, అరుణ్ పిళ్లై, గోరంట్ల బుచ్చిబాబు, అరవింద్, దినేష్ అరోరా, కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, విజయ్ నాయర్ లను కలిపి ఈడీ విచారించినున్నట్లు సమాచారం.
సిసోడియా రిమాండ్ రిపోర్టులో కవితపై ఈడీ కీలక అభియోగాలు మోపింది. సౌత్ లాబీపైన పలు విషయాలను ప్రస్తావించింది. ఈ గ్రూప్ లో రామచంద్ర పిళ్లై, సమీర్ మహీంద్రు, మాగుంట శ్రీనివాసులు రెడ్డికి 65 శాతం పార్టనర్ షిప్ ఉన్నట్లు పేర్కొంది. సిసోడియా తరఫున విజయ నాయర్ పని చేస్తున్నారన్న ఈడీ.. ఇండో స్పిరిట్ కు కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్లై ఉన్నారని తెలిపింది. సౌత్ గ్రూప్ ప్రతినిధిగా ఉన్న బుచ్చిబాబు ఫిబ్రవరి 28వ తేదీన ఇచ్చిన స్టేట్ మెంట్ లో హవాలా మార్గంలో వంద కోట్లు చెల్లించినట్లు చెప్పినట్లు ఈడీ పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత మధ్య రాజకీయ అవగాహన కుదిరిందని వివరించింది. హైదరాబాద్ కేంద్రంగా పలు కీలక సమావేశాలు జరిగాయని తెలిపింది ఈడీ.