Advertisement
రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో పేదలకు అన్యాయం జరుగుతోందని అన్నారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఢిల్లీలో జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రీజనల్ రింగ్ రోడ్డు గురించి దాదాపు 40 నిమిషాలపాటు చర్చించారు. పాయింట్ టు పాయింట్ అంతా డిస్కస్ చేశారు.
Advertisement
భేటీ అనంతరం మాట్లాడిన కోమటిరెడ్డి… రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును వివరించినట్టు చెప్పారు. భూ సేకరణ అవసరానికి మించి జరుగుతోందని.. దీనివల్ల ఎంతోమంది పేదలు, దళితులు నష్టపోతున్నారని తెలిపారు. జోరుగా ధర్నాలు, ఉద్యమాలు జరుగుతున్న విషయాన్ని సంతోష్ కుమార్ కు వివరించినట్టు చెప్పారు ఎంపీ. తరతరాల నుంచి వస్తున్న కొద్దిపాటి భూమిని కోల్పుతున్నవారు చాలామంది ఉన్నారని.. అవసరం లేకున్నా భూములు తీసుకోవడం కరెక్ట్ కాదని అన్నారు.
Advertisement
ప్రజల ఇబ్బందులను గుర్తించుకోవాలన్న కోమటిరెడ్డి.. ఇంకా డిజైన్ అప్రూవల్ కాలేదని.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 500 కోట్లు చెల్లించలేదని అన్నారు. గతంలో ఈ విషయంపై చర్చించేందుకు ఐదారు సార్లు చైర్మన్ ని కలిశానన్న ఆయన.. పార్లమెంట్ లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ప్రైవేట్ భూముల్లో నుంచి కాకుండా ప్రభుత్వ భూముల్లోంచి అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు.
రీజనల్ రింగ్ రోడ్డుకు ఎంత అవసరమో అంతే భూమిని తీసుకోవాలని.. అదికూడా పేదలకు అన్యాయం జరగకుండా ఉండేలా చూడాలన్నారు వెంకట్ రెడ్డి. ఈ విషయాలన్నీ చైర్మన్ తో మాట్లాడినట్లు తెలిపారు. ఆయన అన్నీ సావదానంగా విని సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ విషయంలో తనవంతు సహకారం అందిస్తానని ఛైర్మన్ హామీ ఇచ్చినట్టు చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.