Advertisement
ఈమధ్యే డ్యూటీలో ఉండగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భానురెడ్డి. ఈయనది యాదాద్రి జిల్లా బొమ్మలరామారం. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యుల్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం విధి నిర్వహణలో ఉండగా.. హెలికాప్టర్ ప్రమాదంలో వినయ్ భాను రెడ్డి మృతి చెందడం బాధాకరమని అన్నారు.
Advertisement
వీవీబీ రెడ్డి మృతి నల్గొండ జిల్లాకే కాదు.. దేశానికే పెద్ద లోటు అని చెప్పారు వెంకట్ రెడ్డి. యువ కల్నల్ ను కోల్పోయాం.. ఆయన చనిపోయినప్పుడు ప్రతీ ఒక్కరూ కంటనీరు పెట్టారని గుర్తు చేశారు. వీవీబీ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానన్న ఆయన.. వీరసైనికుడ్ని కోల్పోయామని తెలిపారు. వీవీబీ రెడ్డి, స్పందన రెడ్డి దంపతులిద్దరూ భారత ఆర్మీలో దేశ సేవకు అంకితం కావడం గ్రామానికే కాకుండా జిల్లాకు గర్వకారణమన్నారు.
Advertisement
ఆయన పేరు అందరికీ గుర్తుండిపోయేలా బొమ్మలరామారంలో పార్టీలకు అతీతంగా విగ్రహం ఏర్పాటు చేయాలన్న కోమటిరెడ్డి.. దాన్ని తాను ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఈ కుటుంబానికి అండగా నిలిచి ఆదుకోవాలని కోరారు. సూర్యాపేటలో కల్నల్ సంతోష్ కు కాంస్య విగ్రహం ఎలా ఏర్పాటు చేశారో.. భువనగిరిలో వీవీబీ రెడ్డి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాద్ లో 500 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని.. దీనిపై ముఖ్యమంత్రిని కలవడమా? లేఖ రాయడమా? అనేది ఆలోచిస్తున్నానని చెప్పారు. వినయ్ భానురెడ్డి స్ఫూర్తి అందరికీ గుర్తుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. ఆయన భార్యకు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కల్నల్ వీవీబీ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.