Ads
ఓవైపు లోకేష్ పాదయాత్రతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటే.. ఇంకోవైపు నందమూరి తారకరత్న(ఎన్టీఆర్) ఆస్పత్రిపాలు కావడం కలవరపెట్టింది. లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా తారకరత్న కుప్పం వెళ్లారు. అయితే.. పాదయాత్రలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురై కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో చికిత్స కోసం హుటాహుటిన కుప్పం ఆస్పత్రికి తరలించారు.
బాబాయి బాలకృష్ణ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ఆ సమయంలో అక్కడే ఉండడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. తారకరత్నను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మెరుగైన చికిత్స కోసం రోడ్డు మార్గంలో బెంగళూరు తరలించాలని నిర్ణయించారు. అందుకోసం అక్కడి నారాయణ ఆస్పత్రితో సంప్రదింపులు జరిపారు. అయితే, తారకరత్న భార్య కుప్పం వచ్చాక బెంగళూరు తరలింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Advertisement
బెంగళూరు నుంచి వైద్య నిపుణులు అత్యాధునిక పరికరాలతో కుప్పం వచ్చారు. ప్రస్తుతం తారకరత్నకు కుప్పంలోనే చికిత్స కొనసాగుతోంది. ఆర్టిఫిషియల్ హార్ట్ అమరిక గురించి డాక్టర్ల మధ్య చర్చ నడుస్తోంది. అయితే.. ఉదయం కంటే తారకరత్న ఆరోగ్యం మెరుగైందని పీఈఎస్ వైద్యులు చెబుతున్నారు. తారకరత్న హార్ట్ లో బ్లాక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆయనకు గుండెపోటు వచ్చిందని తెలిపారు.
గుండెలో కుడి, ఎడమ వైపు 95 శాతం బ్లాక్స్ ఉన్నట్లు పేర్కొన్నారు వైద్యులు. తొలిరోజు పాదయాత్ర ముగిశాక తారకరత్నను పరామర్శించేందుకు నారా లోకేష్ కూడా కుప్పంలోని పీఈఎస్ ఆస్పత్రికి వెళ్లారు. మరోవైపు తారకరత్న పరిస్థితిపై జూనియర్ ఎన్టీఆర్ ఆరా తీశారు. బాలకృష్ణకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురవడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలిస్తున్నారని తెలిసిందని.. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఓ ప్రకటనలో చెప్పారు పవన్ కళ్యాణ్.