Advertisement
యువగళం పాదయాత్రలో నారా లోకేష్ వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. సెల్ఫీలతో కర్రు కాల్చి వాత పెట్టిన మాదిరి చురకలంటిస్తున్నారు. ఏ నియోజకవర్గానికి వెళ్లినా అక్కడి ఎమ్మెల్యేలను, సీఎంను ఆటపట్టిస్తున్నారు లోకేష్. ప్రస్తుతం యువగళం యాత్ర ధర్మవరంలో జరుగుతోంది. అక్కడి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
Advertisement
గుడ్ మార్నింగ్ అంటూ వీధుల్లో షో చేసే యూట్యూబ్ స్టార్ కేతిరెడ్డి చేసేవి కబ్జాలు, ఇసుక దందాలు, సెటిల్మెంట్లు అంటూ ఆరోపణలు చేశారు లోకేష్. శనివారం ఎమ్మెల్యే గుట్ట చెరువులు ఆక్రమించి చేసిన కబ్జాలు చూపించిన ఆయన.. ఆదివారం ఉదయం చిత్రావతి నది ఉప్పలపాడు రీచ్ నుంచి సాగిస్తున్న ఇసుక మాఫియా దందా ఫోటోలు విడుదల చేశారు. జనాల్ని ఏమార్చేందుకు గుడ్ మార్నింగ్ డ్రామా.. మూడు పూటలా చేసేవి కబ్జాలు-దందాలు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు లోకేష్. డ్రామాలన్నీ బట్టబయలయ్యాయి.. బ్యాడ్ మార్నింగ్ టూ ఎమ్మెల్యే కేతిరెడ్డి అంటూ సెటైర్లు వేశారు.
Advertisement
కేతిరెడ్డి ఎర్రగుట్టనే మింగేశారని, దోపిడీని ఆధారాలతో నిరూపిస్తానని.. రాజీనామా చేస్తారా? అని సవాల్ చేశారు. ధర్మవరంలో ఎమ్మెల్యే దోపిడీని కలెక్టర్ ముందు పెడతానని వెల్లడించారు. ధర్మవరం రెవెన్యూ పరిధిలోని 902 నుంచి 909 సర్వే నెంబర్లలో.. ఎర్రగుట్టపై 15 ఎకరాలకు దొంగ పత్రాలు సృష్టించి కాజేశారని ఆరోపించారు. 15 ఎకరాల భూమి మాత్రమే కాకుండా మరో 5ఎకరాల భూమిని కేతిరెడ్డి.. తన కుటుంబంలోని ఓ మహిళ పేరుతో నమోదు చేసినట్లు వివరించారు.
ఇటు సీఎం జగన్ పైనా తీవ్ర విమర్శలు చేశారు లోకేష్. జగన్ కు కొత్త పేరు కూడా పెట్టారు. ఆయన జగన్ మోహన్ కాదని.. చోర్ మోహన్ అంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది టీడీపీనే అని తెలిపారు లోకేష్. సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన వ్యక్తి చోర్ మోహన్ అని, వైసీపీ సర్కార్ రూ.10 ఇస్తూ.. రూ.100 దోచుకుంటోందని ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రానికి, ప్రజలకు చోర్ మోహన్ చేసిందేమీ లేదని మండిపడ్డారు లోకేష్.