Advertisement
వైసీపీ పాలనను ఎండగట్టడం.. టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆపార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. నాలుగోరోజు పలమనేరు నియోజకవర్గంలో యాత్రను కొనసాగిస్తున్నారు. కుప్పం నియోజకవర్గం నుంచి పలమనేరులోకి ఎంటర్ కాగానే పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వీ కోట మండలం అన్నవరం గ్రామస్తులు కాస్త వెరైటీగా ఆలోచించారు.
Advertisement
తమ అభిమాన నాయకుడికి స్వాగతం పలికేందుకు భారీ దండను సిద్ధం చేశారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. మామూలుగా దండ పూలతో చేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం 300 కేజీల ఆపిల్స్ తో తయారు చేయించారు. అలాగే, అందులో పూలను కూడా ఉంచారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ స్వాగత కార్యక్రమం జరిగింది. మహిళలు అడుగడుగునా హారతులతో లోకేష్ కు వెల్ కమ్ చెప్పారు. క్రేన్ సాయంతో ఈ భారీ ఆపిల్స్ దండను లోకేష్ కు వేశారు.
Advertisement
ఇక పట్టుగూళ్ల రైతులు లోకేష్ ను కలిశారు. ప్రభుత్వం తమకు సబ్సిడీ ఇవ్వట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలపై స్పందించిన లోకేష్.. జగన్ పై మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే సబ్సిడీ అందిస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా గాంధారమాకుల పల్లెలో వడ్డెర సంఘం సమావేశంలో పాల్గొన్నారు లోకేష్. ఈ సందర్భంగా జగన్ పై విమర్శలు గుప్పించారు. రూ.10 ఇచ్చే కార్యక్రమాలపై కూడా నవ్వుతున్న జగన్ బొమ్మ ఉంటుందని సెటైర్లు వేశారు.
ప్రజల నుంచి రూ.100 లాక్కునే కరెంట్ బిల్లు, ఆర్టీసీ టికెట్, చెత్త పన్ను, ఇంటి పన్ను తదితర కార్యక్రమాలపై మాత్రం ఆయన బొమ్మ ఉండదని ఎద్దేవ చేశారు లోకేష్. ఇచ్చే పది రూపాయలకు నవ్వుతూ ఉంటాడని.. లాక్కునే వంద రూపాయలకు మాత్రం ఫొటో ఉండదని విమర్శించారు. జగన్ ధరల బాదుడుకి కుప్పం, పలమనేరు ప్రజలు పక్కనున్న కర్ణాటక రాష్ట్రానికి వలస పోతున్నారని అన్నారు. వైసీపీ పాలనలో కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు రాష్ట్రానికి రావడాన్ని పక్కన పెడితే… చంద్రబాబు తెచ్చిన కంపెనీలు కూడా జే ట్యాక్స్ కట్టలేక పారిపోతున్నాయని ఆరోపించారు.