Advertisement
పాత సచివాలయం పనికిరాదని కొత్త దానికి శ్రీకారం చుట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. పనులన్నీ చకచకా చేయించారు. అధికారులను పరుగులు పెట్టించారు. రికార్డ్ స్థాయిలోనే కట్టడానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 17న సచివాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకుముందు సంక్రాంతి పండుగకి ప్రారంభించాలని భావించినా అది సాధ్యం కాలేదు. తర్వాత 17న ప్రారంభించేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. అదేరోజు పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. మరోసారి మోడీని కార్నర్ చేయాలని కేసీఆర్ భావించారు.
Advertisement
అయితే.. కేసీఆర్ ప్లాన్ రివర్స్ అయింది.తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎలక్షన్ కోడ్ ఉండడంతో సచివాలయం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. త్వరలోనే కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన తేదీని ప్రకటించనున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపారు. సచివాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా ముందస్తు ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
Advertisement
దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందున అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని భావించింది. 17న నిర్ణయించిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపారు. వారినుంచి వచ్చిన ప్రతి స్పందన ఆశాజనకంగా లేకపోవడంతో.. ఇప్పటికే ప్రకటించిన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రస్థుతానికి వాయిదా వేయడం జరిగింది.
కేసీఆర్ పుట్టినరోజున సచివాలయం ప్రారంభించాలనుకోవడంపై ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. కేసీఆర్ సొంత డబ్బులతో నిర్మించినట్టుగా ప్రజల సొమ్ముతో కట్టిన తెలంగాణ సచివాలయాన్ని ఆయన పుట్టినరోజున ఎందుకు ప్రారంభించాలంటూ నిలదీశాయి. కేఏ పాల్ అయితే.. కోర్టు వరకు వెళ్లారు. ఇటు ప్రారంభోత్సవం వాయిదాపైనా ఆయన స్పందించారు.
తాము చేసిన న్యాయ పోరాటం వల్లే కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా పడిందన్నారు. అంబేద్కర్ జయంతి రోజు ఏప్రిల్ 14న సెక్రటేరియట్ ను ప్రారంభించాలని హైకోర్టులో న్యాయ పోరాటం చేశామని.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు కూడా ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పారు. అయితే.. కేసీఆర్ తన తప్పును ఒప్పుకోకుండా ఎన్నికల కోడ్ తీసుకొచ్చి వాయిదా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైతేనే 17న ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే రోజున ప్రారంభించకుండా చేశామని హర్షం వ్యక్తం చేశారు.