Advertisement
బీజేపీ నేతలు కొత్త నినాదం అందుకున్నారు. గుజరాత్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో రావడంతో తెలంగాణలో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని అంటున్నారు. ‘‘టుడే గుజరాత్-టుమారో తెలంగాణ’’ అనే పోస్టర్ ను కూడా వదిలారు. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. అలాగే అగ్ర నేతలు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో గుజరాత్ సీన్ రిపీట్ అవుతుందని చెప్పారు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్. బీజేపీ 100 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలనకు చరమగీతం పాడుతామని చెప్పారు తరుణ్ చుగ్. రాష్ట్రంలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ మాత్రమే కాదు ఎన్ని పార్టీలు వచ్చినా బీజేపీని ఏమీ చేయలేవని అన్నారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇదే విషయాన్ని వ్యక్తపరిచారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో పాదయాత్ర సందర్భంగా మాట్లాడారు. తెలంగాణలో కూడా గుజరాత్ ఫలితమే పునరావృతమవుతుందని అన్నారు. అవినీతి ప్రభుత్వం ఓడిపోక తప్పదని హెచ్చరించారు. అభివృద్ధి చేసే వాళ్లే గెలుస్తారన్న బండి.. అవినీతిపరులు పడిపోక తప్పదని హెచ్చరించారు.
Advertisement
తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు సంజయ్. దేశంలో అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారని.. బీజేపీకి అధికారం ఇస్తే ఏ విధంగా ఫలాలు అందుతాయో గుజరాత్ ఫలితాలు తెలుపుతున్నాయని చెప్పారు. తెలంగాణలోనూ రాబోయే రోజుల్లో విజయ పరంపర కొనసాగిస్తామని తెలిపారు. ఇటు ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా స్పందించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమన్నారు. బీఆర్ఎస్ కు ఇక వీఆర్ఎసే అని చురకలంటించారు. గుజరాత్ ఫలితాలు చూసి కేసీఆర్ కు నిద్ర పట్టదని ఎద్దేవ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీదే విజయమని 400 సీట్లకు పైగా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు జీవీఎల్.
మరోవైపు కోరుట్లలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు సంజయ్. కేసీఆర్ దేవుడికే శఠగోపం పెట్టినోడు అని ఆరోపించారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్నారు. అలాగే బాసర ఆలయ అభివృద్ధికి రూ.120 కోట్ల ఇస్తానని చెప్పి ఒక్క పైసా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కొండగట్టుకు రూ.100 కోట్లు ఇస్తానని అంటున్నారని.. ఆయన కూతురు అక్కడ స్థలం కొన్నారు కాబట్టే 100 కోట్లని అంటున్నారని ఆరోపించారు. ధర్మపురి గోదావరి పుష్కరాలప్పుడు ఏమైనా వసతులు కల్పించారా? అని ప్రశ్నించిన బండి.. కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం నిజమని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఒకవేళ ఇవ్వడం లేదని తాను నిరూపిస్తే.. కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని ప్రశ్నించారు. తెలంగాణకు రామరాజ్యం కావాలని.. రజాకారుల రాజ్యం పోవాలని అన్నారు బండి సంజయ్.