Advertisement
ఈమధ్య కాలంలో బీఆర్ఎస్ నేతలపై సంచలన ఆరోపణలతో ఎవరో ఒకరు బయటకొస్తున్నారు. ల్యాండ్ వివాదమని ఒకరు.. వేధిస్తున్నారని ఇంకొకరు.. వెంటపడుతున్నారని మరొకరు.. ఇలా ఏదో ఒక వ్యవహారంలో ఇరుక్కుని అధిష్టానం దగ్గర చివాట్లు తింటున్నారు. తాజాగా అదే పరిస్థితిలో ఉన్నారు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఆమధ్య ఎమ్మెల్యే రాజయ్య.. మహిళా సర్పంచ్ ను వేధించిన వ్యవహారంపై చర్చ సాగుతుండగానే.. చిన్నయ్య తన దగ్గరికి అమ్మాయిలను పంపించమని వేధించినట్టు ఆరిజన్ డెయిరీ ఫామ్ ఓనర్ ఆదినారాయణ తీవ్ర విమర్శలు చేశారు.
Advertisement
ఆయనతోపాటు ఓ మహిళ కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. ఎమ్మెల్యేకి ఆదినారాయణకు మధ్య జరిగిన చాటింగ్ స్క్రీన్ షాట్స్ కూడా బయటకొచ్చాయి. దీంతో ఈ వ్యవహారం వైరల్ అవుతోంది. అడిగిన డబ్బులు ఇవ్వనందుకే కావాలని కక్ష కట్టిన చిన్నయ్య తమపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపించారని ఆదినారాయణ, సదరు మహిళ ఆరోపించారు. డెయిరీ ఏర్పాటుకు సహకరించినందుకు బిజినెస్ లో తన వాళ్లకు వాటా ఇవ్వాలని కోరరాని చెప్పారు. అంతేకాకుండా తన కోర్కెలు తీర్చాలని వేధించడంతో బ్రోకర్ల ద్వారా హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్ కే అమ్మాయిలను పంపించినట్టు ఆదినారాయణ ఆరోపించారు.
Advertisement
తమ దగ్గర డబ్బులు వాడుకొని.. పర్సనల్ గా వాడుకొని బ్లాక్ మెయిల్ చేశారని ఎమ్మెల్యేపై విమర్శలు చేశారు. ఓ రోజు తమను బెల్లంపల్లిలోని ఆయన ఇంటికి పిలిచి.. తరువాత అక్కడున్న పోలీసులకు అప్పగించారని అన్నారు. మూడు రోజులు పోలీస్ స్టేషన్ లో పెట్టించి తమపై ఏవేవో కేసులు పెట్టించారని వాపోయారు. మాకేం సంబంధం లేదని పోలీసులకు చెబితే.. ఎమ్మెల్యేతో మాట్లాడుకోండని వాళ్లు చెప్పారని తెలిపారు. ఆ తర్వాత రిమాండ్ కు పంపించారని.. బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్లీ రెండు కేసులు పెట్టారని వాపోయారు. తప్పుడు కేసులకు సంబంధించి తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని వివరించారు.
ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ అధిష్టానం మండిపడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే, ఆయన అనుచరగణం ఇదంతా తప్పుడు ప్రచారం అని అంటున్నారు. వారిద్దరి ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు. ఆ స్క్రీన్ షాట్లకు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ.. కావాలనే ఆరిజన్ డెయిరీ ఫామ్ నిర్వాహకులు తమపై ఆరోపణలు చేస్తున్నారని చిన్నయ్య స్పష్టం చేశారు. వాళ్లద్దరు మోసగాళ్లు అంటూ ఆయన అనుచరులు రివర్స్ ఎటాక్ కొనసాగిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ట్రెండింగ్ లో ఉంది.