Advertisement
ఓటమి ఒంటరిగా రాదు.. అద్భుతమైన అవకాశాలను వెంట తెస్తుంది. వాటిని సరైన సమయంలో సంగ్రహించి ఆచరిస్తే.. గెలుపు తథ్యం. రచయిత సిరివెన్నెల మాటల్లో చెప్పాలంటే.. ‘‘నిరంతర ప్రయత్నం నిరాశకే నిరాశ పుట్టిస్తుంది. నిన్ను మించే శక్తి ఏది.. నీకు నువ్వు బాసటైతే’’. ఓటమి వచ్చిందని కుంగిపోకుండా నమ్మకంతో పోరాడడమే దీని అర్థం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ఓటమిపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా సిరివెన్నెల మాటలను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో జనసైనికులు పోస్టులు పెడుతున్నారు.
Advertisement
హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా సదస్సులో పాల్గొన్నారు జనసేనాని పవన్. ‘ఫేసింగ్ ది ప్యూచర్’ అంశంపై సీఏ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘నా పరాజయాల గురించి నిర్భయంగా మాట్లాడుతా. ఓటమిలోనే జయం ఉంటుంది. డబ్బున్న వాళ్లంతా గొప్పోళ్లు, పేరున్న వాళ్లంతా మహానుభావులు అనుకోవద్దు. ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మొద్దు. దేవుడిని కూడా. ఏది తప్పు.. ఏది ఒప్పు అనేది నిర్ణయించుకోవాలి. మన వ్యక్తిగత విజయమే దేశానికి పెట్టుబడి’’ అని తెలిపారు.
Advertisement
2019లో తాను ఫెయిలయ్యానని.. కానీ ఓడిపోలేదని.. అందుకే పట్టువదలకుండా ప్రయత్నిస్తున్నాన్నారు. చార్టెడ్ అకౌంటెన్సీ ఎంత కష్టమో తనకు తెలుసని అందుకే ఫెయిలయినా పట్టు వదలకుండా తనలాగే ప్రయత్నించాలని వారికి సూచించారు. పవన్ సీఏలకు స్ఫూర్తి దాయక విషయాలు చెప్పారు. వైఫల్యాలను కూడా తాను సానుకూల దృక్పథంతోనే చూస్తానని చెప్పారు. సమాజంలో మార్పు రావాలని కోరుకుంటూ కొంతమంది ఏమీ చేయకుండా కూర్చుంటారని, తాను అలాంటి వాడిని కాదని అన్నారు. తాను ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని.. కానీ, ఓడిపోయానని చెప్పుకోవడానికి ఏ మాత్రం మొహమాటపడనని తెలిపారు.
పవన్ వ్యాఖ్యలుకు విద్యార్థులు ఫిదా అయ్యారు. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్న ఈ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోసారి తన స్పీచ్ తో జనసేనాని అందర్నీ ఆకట్టుకున్నారని ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓటమి వచ్చిందని కుంగిపోకుండా పట్టుదలతో పోరాటం సాగించడని పవన్ తననే ఉదాహరణగా చెప్పడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.