Advertisement
ఏపీలో అధికారం కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. శనివారం బీసీ సదస్సు నిర్వహించిన ఆయన.. ఆదివారం కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో భేటీ అయ్యారు. బీసీలు, కాపులు కలిస్తే ఏపీలో అధికారం దక్కించుకోవడం చాలా ఈజీ. ఈ నేపథ్యంలోనే పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు రాజకీయ పండితులు. అయితే.. వైసీపీ నేతలకు మాత్రం ఇది రుచించడం లేదు.
Advertisement
బీసీలను వర్గాలుగా విభచించారని అన్న పవన్.. కాపుల విషయంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాపులు అధికారంలోకి వస్తే మిగతావారిని తొక్కేస్తారన్న విష ప్రచారం జరుగుతోందని… దీనిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని విడగొట్టేవారే ఎక్కువని కలిపేవారు తక్కువని అభిప్రాయపడ్డారు. అధికారం అనేది ఏ ఒక్కరి సొంతం కాదన్న పవన్.. కుళ్లు, కుతంత్రాలు లేని రాజకీయాలు ఉండవని స్పష్టం చేశారు.
రాజకీయ సాధికారత కావాలంటే కాపులంతా ఏకం కావాలని సూచించారు పవన్. తానెప్పుడూ లోపాయకారీ ఒప్పందాలు పెట్టుకోనని.. కాపుల ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ తగ్గించనని అభిప్రాయపడ్డారు. ఏ పార్టీ అజెండా కోసం పనిచేయడం లేదని.. జనసేనను నమ్మినవారి ఆత్మగౌరవాన్ని తాము తగ్గించబోమని పవన్ పేర్కొన్నారు. కాపు ఉద్యమ నేత హరిరామ జోగయ్య మాట్లాడుతూ.. విపక్షాలు కలవాలని చంద్రబాబు అంటారని, కానీ రాజ్యాధికారం వారి చేతుల్లోనే పెట్టాలంటారని విమర్శించారు.
Advertisement
వైసీపీ ఎన్ని వ్యూహాలు రచిస్తోందో.. టీడీపీ కూడా అన్ని పన్నుతోందని ఆరోపించారు. కన్నా, మహాసేన రాజేష్ లాంటి వారిని జనసేనలో చేరకుండా చంద్రబాబు అడ్డుకున్నారని చెప్పారు. జనసేనను చంద్రబాబు వీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కేవలం 20 సీట్లే జనసేనకు ఇస్తామంటూ ప్రచారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, ఎలాంటి ఒప్పందం చేసుకున్నా తామంతా పవన్ వెంటే ఉంటామని హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. అయితే.. పవన్ కి, కాపుల గౌరవానికి భంగం కలగరాదన్నారు. గౌరవం అంటే సీఎం పదవిలో కూర్చొబెట్టడమేనని స్పష్టతనిచ్చారు.
మరోవైపు పవన్ వరుస భేటీల నేపథ్యంలో వైసీపీ నేతలు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. బీసీల గురించి మాట్లాడే అర్హతే లేదని.. తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని చెబుతున్నారు. పవన్ ది కేవలం ఒక సెలబ్రిటీ పార్టీ అని, మూడ్ వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతుంటారని, ఆయన వైఖరి చూస్తుంటే జాలేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ చురకలంటించారు. పవన్ పదేళ్ళలో బీసీల కోసం ఏమి మాట్లాడారని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్. అసలు పవన్ భావజాలంలోనే బీసీలు లేరన్నారు. వారికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ పార్టీ పెట్టిన పదేళ్లలో ఒక్క సర్పంచ్ ను కూడా గెలిపించుకోలేకపోయారని సెటైర్లు వేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.