Advertisement
హెడ్డింగ్ చూసి షాకవ్వకండి. ఇది రాజకీయం అంశానికి సంబంధించింది కాదు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించింది. ఏపీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కు పారిశ్రామిక దిగ్గజాలు తరలివస్తున్నారు. ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో వేదికలు సిద్ధం చేశారు. సుమారు 2 లక్షల 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేదికలను ముస్తాబు చేశారు.
Advertisement
ఈ సమావేశానికి ఏడుగురు కేంద్ర మంత్రులు, 40 దేశాల నుంచి రాయబారులు, పాతిక దేశాల ప్రతినిధులు, మన దేశానికి చెందిన 30 మంది పారిశ్రామిక దిగ్గజాలు విశాఖ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన స్పందించారు. శక్తివంతమైన, అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్ యువత పెట్టుబడిదారుల్ని మెప్పిస్తారని భావిస్తున్నానన్నారు.
Advertisement
ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు.. మన యువతకు ఉపాధిని అందించే అవకాశం వస్తుందని భావిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందుతారని ఆశిస్తున్నానన్నారు. ఏపీలో ఆర్థిక వృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించాలని వైసీపీ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా విన్నవించారు.
పెట్టుబడులను కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా ఏపీ మొత్తానికి నిజమైన ఇన్వెస్టర్ల సమ్మిట్ లాగా మార్చాలని సూచించారు. రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదని.. పెట్టుబడుల ఆకర్షణ అంశంలో సహకారం అందిస్తుందన్నారు. ఈ సమ్మిట్ సందర్భంగా ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెబుతూ.. రాజకీయం కంటే రాష్ట్ర శ్రేయస్సు మిన్న అని అన్నారు పవన్ కళ్యాణ్.
Also Read: ఏపీ రాజకీయ వార్తలు Telugu News