Advertisement
ఇండోనేషియాలో జీ-20 సదస్సు ఎంతో అట్టహాసంగా జరిగింది. బాలి ఐలాండ్ లో రెండు రోజుల పాటు దీన్ని నిర్వహించారు. జీ-20లోని దేశాధినేతలంతా పాల్గొన్నారు. తమ తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. జీ-20 అనేది ప్రపంచ జీడీపీలో 85 శాతం ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న దేశాల సమూహం. ఏడాదికో దేశం ఈ సదస్సును నిర్వహిస్తుంటుంది. 2023 ఏడాది భారత దేశంలో ఇది జరగనుంది. ఈ మేరకు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడో సదస్సు బాధ్యతలను భారత ప్రధాని నరేంద్ర మోడీకి అప్పగించారు.
Advertisement
డిసెంబరు 1 నుంచి భారత్ అధికారికంగా జీ-20కి అధ్యక్షత బాధ్యత ప్రారంభం అవుతుంది. ఈ బాధ్యతలు భారత్ కు దక్కడం ప్రతి భారతీయుడికీ గర్వకారణంగా మోడీ పేర్కొన్నారు. ఈమధ్యే భారత జీ-20 లోగో, థీమ్, వెబ్ సైట్ ను ప్రధాని ఆవిష్కరించారు. లోగో విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గొడవ జరుగుతోంది. ఆ విషయం పక్కనపెడితే.. ఇది భారతదేశానికి ఒక చారిత్రక సందర్భం అని మోడీ తెలిపారు. లోగోలో ఉన్న తామర పువ్వు పౌరాణిక వారసత్వాన్ని గుర్తుగా వివరించారు.
Advertisement
ఇక జీ-20 నేతలకు భారత ప్రధాని మోడీ ప్రత్యేక గిఫ్ట్‌లు ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కాంగ్రా మీనియేచర్ ను బహుమతిగా ఇచ్చారు. దీన్ని హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రాలో తయారు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్, సింగపూర్ ప్రధాని లీ లూంగ్, జర్మనీ ఛాన్స్ లర్ ఒలాఫ్ లకు గుజరాత్ కచ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన స్పెషల్ బౌల్ ను గిఫ్ట్ ఇచ్చారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో వీడోడోకు వెండి గిన్నెను బహుకరించారు. దాంతో పాటు హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకువచ్చిన ప్రత్యేకమైన శాలువాను అందించారు.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు జగన్మాత ఫోటో చిత్రించిన వస్త్రాన్ని ప్రధాని మోడీ బహుమతిగా ఇచ్చారు. దీన్ని గుజరాత్ లోని వాఘేరి కమ్యూనిటీకి చెందిన చేనేత కార్మికులు ప్రత్యేకంగా రూపొందించారు.ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనికి ఫితోరా గిరిజన జానపద కళాకృతిని అందజేశారు. గుజరాత్ లోని చోటా ఉదయ్ పూర్ కు చెందిన రత్వా కళాకారులు తయారు చేశారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి పటాన్ పటోలా దుపట్టాను బహూకరించారు. ఉత్తర గుజరాత్ లోని సాల్వి కుటుంబస్తులు దీన్ని ప్రత్యేకంగా రెడీ చేశారు. డబుల్ ఇక్కత్ సాంకేతికతను ఇందులో ఉపయోగించారు. ఈ కళ భారత్ కాకుండా కేవలం జపాన్, ఇండోనేషియాలో మాత్రమే ఉంది.