Advertisement
తెలంగాణలో కాంగ్రెస్ ను తొక్కేస్తున్నారని మొదట్నుంచి ఆపార్టీ నేతలు అంటున్నారు. ఓవైపు తమపార్టీ నేతలను కొనుగోలు చేస్తూ.. ఇంకోవైపు బీజేపీనే ప్రత్యామ్నాయం అనేలా కలరింగ్ ఇస్తున్నారని తరచూ హస్తం నేతలు చెబుతుంటారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఈ డ్రామా ఆడుతుంటాయని విమర్శిస్తుంటారు. అందుకే కాంగ్రెస్ ఏ కార్యక్రమం చేపట్టినా అడ్డుకునే ప్రయత్నం చేస్తారని మండిపడుతుంటారు. మొన్న పంచాయతీల నిధుల విషయంలో చేపట్టిన ధర్నా సమయంలో జరిగింది అదేనని ఉదాహరణగా చెబుతున్నారు. అయితే.. కోర్టు మెట్లెక్కి మరీ ఈ ధర్నాకు పర్మిషన్ తెచ్చుకుంది హస్తం పార్టీ.
Advertisement
పంచాయతీ నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్రం పంపే నిధుల్ని ఇతర అవసరాలకు వాడుకుంటూ సర్పంచులను అప్పులపాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో.. కొందరు సర్పంచులు రాజీనామా బాటపట్టారు. ఈక్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఇందిరాపార్క్ దగ్గర ధర్నాకు ప్లాన్ చేసింది. కానీ, అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడే నేతల్ని అదుపులోకి తీసుకున్నారు.
Advertisement
రేవంత్ రెడ్డిని ఇల్లు కదలనియ్యలేదు. బయటకొచ్చిన ఆయన్ను అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్ కు తరలించారు. ఆ సమయంలో పోలీసులు అనుసరించిన తీరుపై రేవంత్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. సర్పంచులకు అండగా తాము చేపట్టే ధర్నాను అడ్డుకున్నారని పిటిషన్ వేసింది. తమ నిరసనకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలని కోరింది. కాంగ్రెస్ అభ్యర్థనపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొన్ని కండిషన్స్ తో ధర్నాకు ఓకే చెప్పింది.
హైకోర్టు ఆదేశాలతో చేసేదేం లేక పోలీసులు అనుమతినిచ్చారు. ఈనెల 9వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చౌక్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరగనుంది. ఈ ధర్నాలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. ‘రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ ధర్నా’ పేరుతో ఈ కార్యక్రమం జరగనుంది.