Advertisement
గతేడాది లాగే ఈసారి కూడా రాజ్ భవన్ కే రిపబ్లిక్ డే వేడుకల్ని పరిమితం చేయాలని భావించింది ప్రభుత్వం. అయితే.. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలవ్వడంతో ఇష్యూ ఇంట్రస్టింగ్ గా మారింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గణతంత్ర దినోత్సవం ఎప్పటిలాగే ఘనంగా జరపాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కోవిడ్ ప్రభావం కొనసాగుతోందన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. రాష్ట్రంలో అమలులో ఉన్న ఆంక్షలేంటో చెప్పాలని అడిగింది. దేశమంతటా జాతీయ పండగగా నిర్వహిస్తున్న వేడుకను నిర్లక్ష్యం చేయొద్దని తెలిపింది.
Advertisement
ఇటు ప్రభుత్వ నిర్ణయం.. కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు పలు రకాలుగా స్పందించారు. ఎవరెవరు ఏమన్నారంటే..?
బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
“పరేడ్ గ్రౌండ్ లో ఏటా నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం అప్రజాస్వామికం. రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించడమే. రాజ్యాంగబద్దంగా గవర్నర్ తన విధులు నిర్వహించకుండా కట్టడి చేయాలని ముఖ్యమంత్రి చేస్తున్న కుట్రలో భాగమే ఇది. సీఎం తీరును బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం’’
Advertisement
మల్లు రవి, కాంగ్రెస్ సీనియర్ నేత
‘‘స్వాతంత్య్ర దినోత్సవం మాదిరిగానే జనవరి 26న కూడా దేశం మొత్తం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటుందని.. కానీ మన రాష్ట్రంలో మాత్రం కరోనా సాకు చూపించి జరుపుకోకపోవడం దురదృష్టకరం. రిపబ్లిక్ డే పరేడ్ తో నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోకుండా రాజ్యాంగాన్ని అవమానిస్తోంది. ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభకు కోవిడ్ నిబంధనలు గుర్తుకురాలేదా? రాజ్యాంగ వ్యవస్థను, గవర్నర్ ను కేసీఆర్ అవమానిస్తున్నారు’’
తలసాని శ్రీనివాస్, మంత్రి
‘‘సీఎం కేసీఆర్ చెబితేనే మేము రాజ్ భవన్ లో వేడుకలకు హాజరవుతాం. ప్రొసీజర్ ప్రకారమే రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతాయి. రాజ్ భవన్ లో జెండా ఎగురవేయొద్దని మేము గవర్నర్ కు చెప్పామా? గవర్నర్ రోల్ ఏంటో, సీఎం పాత్ర ఏంటో మాకు తెలుసు. గవర్నర్ కంటి వెలుగు కార్యక్రమానికి వస్తానంటే తాము ఆపలేదు. కేసీఆర్ పుట్టిన రోజు నాడు సచివాలయం ప్రారంభిస్తే తప్పేంటి? మోడీ పుట్టిన రోజు నాడు కేంద్ర ప్రభుత్వం ఏదైనా కడితే దాన్ని ప్రారంభించుకోవచ్చు. బండి సంజయ్ మోడీకి ఆ సలహా ఇచ్చుకోవచ్చు. ప్రతి దాన్ని వివాదం చేయడం బీజేపీకి అలవాటుగా మారింది. గవర్నర్ కు, బీజేపీకి సంబంధమేంటి..?’’