Advertisement
ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య చాలా గ్యాప్ తర్వాత ఈమధ్యే వివాదం రాజుకుంది. పెండింగ్ బిల్లుల విషయంలో ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడం చర్చనీయాంశమైంది. అలాగే, గవర్నర్ కూడా అదే రీతిలో కౌంటర్ ఇవ్వడంతో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై చర్చ సాగుతుండగానే.. మరో కొత్త పంచాయితీ మొదలైంది. ఈసారి యుద్ధం మెడికల్ కాలేజీల చుట్టూ నడుస్తోంది.
Advertisement
ముందుగా మెడికల్ కాలేజీలపై గవర్నర్ తమిళిసై ఓ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 8 సంవత్సరాలలో దేశంలో దాదాపు 300 నుండి 700 కాలేజీలను నిర్మించిందని ప్రశంసలు కురింపించారు. అయితే.. ఈ ట్వీట్ కు తెలంగాణకు ఎన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చారు? అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి తమిళిసై స్పందించారు. పీఎంఎస్‌ఎస్‌వై పథకం కింద ప్రతి రాష్ట్రం కొత్త కాలేజీల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా పిలిందన్నారు. కానీ, సకాలంలో దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు. 11 మెడికల్ కాలేజీలు వచ్చాయని.. ఆలస్యంగా నిద్రలేస్తే ఎలా అంటూ ఎద్దేవ చేశారు.
Advertisement
తమిళిసై వ్యాఖ్యలపై బీర్ఎస్ వర్గాలు భగ్గుమంటున్నాయి. గవర్నర్ ట్వీట్ కు కౌంటర్ ట్వీట్లు పెడుతున్నారు నేతలు. రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి స్పందిస్తూ.. గవర్నర్ ట్వీట్లు ప్రచారం తప్ప మరేమీ కాదన్నారు. ఇలాంటి గౌరవనీయమైన పదవిని చేపట్టే హక్కు ఆమెకు లేదని మండిపడ్డారు.
మరోవైపు మెడికల్ కాలేజీలపై మంత్రి హరీష్ చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ‘‘మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిందన్నది పచ్చి నిజం. రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని పలుమార్లు కోరితే 157 మెడికల్ కాలేజీల్లో కనీసం ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వకుండా మొండిచేయి చూపింది. ఒకటో ఫేస్ , రెండో ఫేస్ లో ఇవ్వలేదు. దీంతో గట్టిగా ప్రశ్నిస్తే మూడో ఫేస్ లో ఇస్తామని చివరకు మోసం చేసింది. ఇప్పుడు నర్సింగ్ కాలేజీల విషయంలో కూడా అదే వివక్షను ప్రదర్శించింది. మెడికల్ కాలేజీల విషయంలో ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడటం బాధాకరం’’ అంటూ మండిపడ్డారు. మొత్తానికి గవర్నర్ చుట్టూ మరో వివాదం కొనసాగుతోందని అంటున్నారు.