Advertisement
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈసారి రెండు విడతల్లో సమావేశాలను నిర్వహిస్తున్నారు. మొదటి విడతగా ఫిబ్రవరి 13 వరకు షెడ్యూల్ ఫిక్స్ చేశారు. అలాగే, మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడతలో సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఉభయసభలనుద్దేశించి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
Advertisement
ప్రపంచానికి పరిష్కారాలు చూపేలా భారత్ తయారైందని అన్నారు ముర్ము. అన్ని వర్గాల అభివృద్ధికి కృషి జరుగుతోందని.. రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదవుతున్నాయని చెప్పారు. మునుపెన్నడూ లేనంత ఆత్మవిశ్వాసంతో దేశం పురోగమిస్తోందని వివరించారు. పేదరికం లేని భారత్ నిర్మాణం కోసం కృషి జరుగుతోందన్న ఆమె.. భారత డిజిటల్ నెట్ వర్క్ వ్యవస్థ ప్రపంచానికే ఉదాహరణగా మారిందన్నారు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల కోసం ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.
Advertisement
కరోనా కష్టకాలాన్ని అధిగమించడంలో స్థిరమైన ప్రభుత్వం కృషి చేసిందన్న రాష్ట్రపతి.. సాంకేతికతను అందిపుచ్చుకొని నూతన ఆవిష్కరణలు తీసుకొస్తున్నామన్నారు. పేదల ఆలోచన స్థాయిని కూడా పెంచుతున్నామని.. ఆయుష్మాన్ భారత్ వంటి మెరుగైన పథకాలు తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని.. అవినీతి రహిత వ్యవస్థలను రూపొందిస్తున్నామని చెప్పారు. బినామీ ఆస్తుల స్వాధీనం దిశగా చర్యలు తీసుకున్నామని.. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందన్నారు ముర్ము.
మరోవైపు రాష్ట్రపతి ముర్ము ప్రసంగాన్ని బహిష్కరించాయి పలు విపక్ష పార్టీలు. కాంగ్రెస్, ఆప్, బీఆర్ఎస్ వంటి పార్టీల ఎంపీలు ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేశారు. అయితే.. విపక్ష నేతలు ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై బీజేపీ మండిపడుతోంది. పార్లమెంట్ పట్ల, ఈ దేశం పట్ల వారు చూపుతున్న అగౌరవానికి ఇది నిదర్శనమని అమిత్ మాలవీయ తీవ్రంగా తప్పు పట్టారు.
సమావేశాలకు ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. కేవలం మన దేశం మాత్రమే కాదు.. అన్ని దేశాలు కూడా మన బడ్జెట్ పై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ప్రపంచ ఆర్ధిక అంశాలపై విశ్వసనీయమైన సంస్థలు కొన్ని పాజిటివ్ సందేశాలు చేశాయన్న ఆయన.. విపక్ష నేతలు సమావేశాలకు సహకరించాలని కోరారు.