Advertisement
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. సర్జికల్ స్ట్రైక్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి ఎలాంటి రుజువులు ఉన్నాయని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇది ముమ్మాటికీ సైనికులను కించపరచడమే అని బీజేపీ తగులుకుంది. దీంతో రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన జోడో యాత్ర జమ్మూకాశ్మీర్ లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. దిగ్విజయ్ వ్యాఖ్యల్ని ఖండించారు.
Advertisement
భద్రతా దళాలపై దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు రాహుల్ గాంధీ. రక్షణ దళాలను తాము నమ్ముతామని తెలిపారు. అవి తమ పనిని తాము అసాధారణంగా చేస్తున్నాయని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్స్ పై తమ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇటు జైరాం రమేష్ కూడా ఇదే చెప్పారు.
Advertisement
ఇక వివాదాస్పదమైన బీబీసీ మోడీ డాక్యుమెంటరీ వివాదంపైనా స్పందించారు రాహుల్. ఎన్ని ప్రయత్నాలు చేసినా నిజాన్ని దాచి పెట్టలేరని వ్యాఖ్యానించారు. ఏదో ఒక విధంగా వాస్తవం వెలుగులోకి వస్తుందని తెలిపారు. నిషేధించినా, అణచివేయాలని చూసినా, సీబీఐ, ఈడీలను ఉపయోగించినా, వ్యవస్థలను నియంత్రించాలని చూసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నిజాన్ని దాయలేరు అని అన్నారు రాహుల్.
2002 నాటి గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ డాక్యుమెంటరీని షేర్ చేయకూడదని కేంద్రం ట్విటర్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ ఇలా రియాక్ట్ అయ్యారు.
మరోవైపు బాలీవుడ్ సీనియర్ నటి ఊర్మిళ మంగళవారం భారత్ జోడో యాత్రలో పాల్గొంది. రాహుల్ తో కలసి కొంత దూరం నడిచింది. నటులు వచ్చి చేరినప్పుడు ఆ ప్రయాణం మరింత ప్రకాశవంతంగా ఉంటుందంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. భారత్ జోడో యాత్ర ముగింపు దశలో ఉంది.