Advertisement
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. గత కాంగ్రెస్ పాలనలో జరిగిన అవకతవకలు, కుంభకోణాలను ప్రస్తావిస్తూ సెటైరికల్ గా మాట్లాడారు. దర్యాప్తు సంస్థలపై విపక్షాలన్నీ కలిసి విమర్శలు చేస్తున్నాయని.. వాళ్లు కలిసింది దేశం కోసం కాదని చురకలంటించారు. ఈడీ దెబ్బకు ప్రతిపక్షనాయకులంతా ఏకతాటిపైకి వచ్చారన్నారు. ఈ సందర్భంగా ఈడీకి ధన్యవాదాలు చెప్పాల్సిందేనని వ్యాఖ్యానించారు.
Advertisement
తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశానని చెప్పిన మోడీ.. ప్రజలకు తనపై విశ్వాసం ఉందని, అది విపక్షాలకు అందదని చెప్పారు. తాను 25 కోట్ల కుటుంబాల సభ్యుడినని.. వాళ్లందరికీ తాను సేవ చేస్తుంటే.. కొందరు ఒకే కుటుంబానికి సేవ చేశారని విమర్శించారు. గతంలో తన సమస్యల పరిష్కారం కోసం భారత్ ఇతరులపై ఆధారపడేదని, నేడు మనమే ఇతర సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. నిరాశలో ఉన్న కొందరు దేశ ప్రగతిని అంగీకరించలేకపోతున్నారని అన్నారు.
Advertisement
కొందరు నిరాశలో మునిగిపోయి దేశ విజయాలను సహించలేకపోతున్నారని చెప్పారు మోడీ. నేడు అనేక దేశాలను నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వేధిస్తున్నాయని.. భారత్ మాత్రం ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా నిలిచిందని వివరించారు. భారత్ లో ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని చురకలంటించారు. ఇక మోడీ ప్రసంగం తర్వాత పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి ప్రసంగం మొత్తం విన్నానని.. ఎక్కడా అదానీ కుంభకోణాల అంశాన్ని ప్రస్తావించలేదన్నారు.
అదానీ అంశాన్ని సభ్యులు సభలో లేవనెత్తినా కూడా ప్రధాని మాత్రం గమ్మునుండిపోయారని మండిపడ్డారు రాహుల్. ప్రధాని చేసిన ప్రసంగం తనకు సంతృప్తి కలిగించలేదని.. నిజంగానే ఆయనకు చిత్తశుద్ధి ఉంటే అదానీ కుంభకోణాల వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలన్నారు. అదానీని మోడీ రక్షిస్తున్నారన్నది స్పష్టమైపోయిందన్న ఆయన.. రానున్న రోజుల్లో అదానీ వ్యవహారంపై తమ పార్టీ ఉధృత పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఇటు అదానీ గ్రూప్ తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకునేందుకు మోడీ ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థల సాయం తీసుకుంటోందని లోక్ సభలో కాంగ్రెస్ విప్ మాణిక్కం ఠాగూర్ ఆరోపించారు.