Advertisement
రాహుల్ గాంధీపై అనర్హతకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ర్యాలీలు, ధర్నాలు అంటూ ఈనెల 30 దాకా ఏదో ఒక హడావుడి ఉండేలా ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే అనర్హత తర్వాత తొలిసారి రాహుల్ తన సొంత నియోజకవర్గం వయనాడ్ కు వెళ్లారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ముందు సత్యమేవ జయతే పేరుతో భారీ ర్యాలీ తీయగా.. తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు రాహుల్.
Advertisement
కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా వయనాడ్ ప్రజల నుంచి తనను వేరు చేయలేదని అన్నారు. తన ఇంటికి పోలీసులను పంపి భయపెట్టాలని చూశారని.. ఆ ఇంటిని ఖాళీ చేయించడం తనకు సంతోషం కలిగించిందని తెలిపారు. అక్కడ ఉండటం తనకు సంతృప్తిగా లేదన్న రాహుల్.. నాలుగేండ్ల నుంచి ఇక్కడకు వచ్చి మీ ఎంపీగా సేవ చేస్తున్నానని ప్రజలనుద్దేశించి అన్నారు. తాను ప్రచారానికి రాలేదని.. మీ కుటుంబ సభ్యుడిగా వచ్చానని తెలిపారు.
Advertisement
ప్రజా ప్రతినిధి అంటే ప్రజల సమస్యలను, ఉద్వేగాలను అర్థం చేసుకోవాలని అన్నారు రాహుల్ గాంధీ. నిజమైన ప్రజాప్రతినిధి తాను కోరుకునే విషయాలను వదిలివేయాలని పేర్కొన్నారు. ఎంపీ అనేది ఓ ట్యాగ్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. రాహుల్ తోపాటు ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ర్యాలీలో పాల్గొన్న ఆమె.. సభలోనూ కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అదానీని ప్రధాని మోడీ ఎందుకు సమర్ధిస్తున్నారని ప్రశ్నించారు ప్రియాంక. ఈ వివాదంపై మోడీ ఎందుకు స్పందించడం లేదని అడిగిన ఆమె.. దేశ ప్రజలు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. కానీ, బీజేపీ వాటిని పట్టించుకోకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
మోడీ ఇంటిపేరు విషయంలో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ తీర్పునిచ్చింది. ఆ తర్వాత లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. దీంతో రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఈ కేసులో రాహుల్ గాంధీ కోర్టును ఆశ్రయించగా.. బెయిల్ ను 13 వరకు పొడిగించారు. ఇటు కిందికోర్టు తీర్పును ఆయన సవాల్ చేస్తూ పైకోర్టుకు వెళ్లారు.