Advertisement
అమెరికన్ సంస్థ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికతో వ్యాపారవేత్త అదానీ అంతకంతకూ దిగజారిపోతున్నారు. కుబేరుల జాబితాలో కిందకు వెళ్లిపోతున్నారు. అయితే.. ఈ పతనం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఈ క్రమంలో.. ఆర్ఎస్ఎస్ అదానీ గ్రూప్ నకు మద్దతుగా నిలిచింది. హిండెన్ బర్గ్ ఉద్దేశపూర్వకంగా ఇది చేసిందని తెలిపింది. ఈ మేరకు సంఘ్ అధికారిక వెబ్ సైట్ ఆర్గనైజర్ లో ఒక కథనం ప్రచురించింది.
Advertisement
దీని వెనుక ఒక వర్గానికి చెందిన వారి వ్యతిరేక ప్రచారం ఉందని ఆరోపించింది ఆర్ఎస్ఎస్. అదానీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ప్రచారంలో వామపక్ష భావజాలంతో కూడిన కొన్ని వెబ్ సైట్లు, వ్యక్తులున్నారని ఆరోపించింది. ఈ దాడి జనవరి 25న మొదలు కాలేదని.. 2016-17లో ఆస్ట్రేలియాలోనే బీజాలు పడ్డాయని వివరించింది. ఆస్ట్రేలియాకు చెందిన బాబ్ బ్రౌన్ ఫౌండేషన్ కి చెందిన ఒక అనుకూల వెబ్ సైట్.. అదానీని దెబ్బ తీయడానికి కథనాలు ప్రచురించిందని గుర్తు చేసింది.
Advertisement
మరోవైపు అదానీ గ్రూపు కంపెనీల వ్యవహారంపై ప్రతిపక్షాలు విమర్శల దాడిలో స్పీడ్ పెంచాయి. దీనిపై భారత ప్రభుత్వం గానీ, ప్రధాని మోడీ గానీ ఇప్పటివరకు స్పందించకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పు పట్టింది. మోడీ ఎంతకాలం మౌనంగా ఉంటారని.. ఈ తీరు చూస్తుంటే ఇదంతా కుమ్మక్కయిన వ్యవహారంలా ఉందని ఆపార్టీ నేత జైరాం రమేష్ విమర్శించారు. స్టాక్ మార్కెట్ లో అదానీ మోసపూరిత లావాదేవీలు రోజుకొకటిగా వెలుగులోకి వస్తున్నాయని ఆయన అన్నారు. ఈ నిర్వాకంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మోడీని టార్గెట్ చేస్తూ అదానీ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి అదానీ అత్యంత ఆప్తమిత్రుడని అన్నారు. అందువల్లనే ఆయన అపరు కుబేరుడిగా మారారని చెప్పారు. ఒక సాధారణ వ్యాపారిగా ఉన్న అదానీ రెండేండ్ల వ్యవధిలోనే ఎదగడంపై యావత్తు దేశం ఇప్పుడు చర్చిస్తోందని అన్నారు. దేశంలో సుసంపన్నమైన బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ దిగుమతి పాలసీలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయడం వెనుక ఉన్న రహస్యమేంటని ప్రశ్నించారు కేసీఆర్. కేవలం అదానీ ఆర్థిక ప్రయోజనాల కోసమే బొగ్గు దిగుమతి పాలసీని మార్చాల్సి వచ్చిందన్నారు.