Advertisement
లిక్కర్ స్కాం కేసు తీగ ఢిల్లీలో లాగితే.. హైదరాబాద్ కేంద్రంగా డొంకంతా కదులుతోంది. ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థ ఈడీ గురువారం అరబిందో గ్రూప్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, మద్యం వ్యాపారి వినయ్ బాబులను అరెస్ట్ చేసింది. శరత్ చంద్రారెడ్డి 12 కంపెనీలకు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థలోనూ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
Advertisement
హైదరాబాద్ లో ఇద్దర్నీ అరెస్ట్ చేసిన అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల కస్టడీకి అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరారు. కోర్టు వారం రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది. అయితే, కొన్ని షరతులను కూడా విధించింది. 24 గంటలకు ఒకసారి నిందితులకు వైద్య పరీక్షలు చేయించాలని.. అలాగే సీసీటీవీ పర్యవేక్షణలో వీరిని ప్రశ్నించాలని సూచించింది.
Advertisement
శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబుకు కోట్ల రూపాయల మద్యం వ్యాపారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మద్యం స్కాంలో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ ను సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చింది. ఢిల్లీ మద్యం పాలసీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించారన్న అభియోగాలపై శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసింది ఈడీ. ఈ కేసులో కీలక పాత్ర పోషించాడని భావిస్తోన్న అభిషేక్ బోయిన్ పల్లిని ఇప్పటికే జైలుకు పంపించారు అధికారులు. సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో శరత్ చంద్రారెడ్డిని ప్రశ్నించింది ఈడీ.
మరోవైపు శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ రిపోర్టులో ఈడీ కీలక విషయాలు పొందుపరిచినట్లు సమాచారం. స్కాం ఎలా జరిగిందో అందులో వివరించింది. శరత్ చంద్రారెడ్డి రూ.64 కోట్ల వరకు మనీలాండరింగ్ కు పాల్పడ్డాడని తెలిపింది. లంచాలు ఇచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాడని.. స్కాంలో శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రులు కీలకపాత్ర పోషించినట్లు తేల్చింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 169 చోట్ల సోదాలు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. లిక్కర్ స్కాంలో 34 మంది పాత్ర బయటపడిందని వెల్లడించింది. రూ. 100 కోట్ల వరకు లంచాలు ఇచ్చినట్లు తెలిపింది.