Advertisement
మోడీ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో పెద్దనోట్ల రద్దు ఒకటి. బ్లాక్ మనీని కట్టడి చేసే ఉద్దేశంతో దీన్ని అమలు చేసింది ప్రభుత్వం. అయితే.. ఇది సరైన పద్దతిలో జరగలేదని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ ఒకేసారి విచారించిన న్యాయస్థానం.. తుది తీర్పు వెలువరించింది. సుప్రీం ధర్మాసనంలోని నలుగురు సభ్యులు.. పెద్దనోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా లేదని వెల్లడించారు.
Advertisement
సుధీర్ఘంగా వాదనలు విన్న జస్టిస్ ఎస్‌ఏ నజీర్ నేతృత్వంలోని బెంచ్ లోని సభ్యులు జస్టిస్ లు బిఆర్ గవాయ్, ఎఎస్ బోపన్న, వి రామసుబ్రమణియన్ నోట్ల రద్దును సమర్థించారు. అయితే.. జస్టిస్ బివి నాగరత్న మాత్రం భిన్నమైన తీర్పును ఇచ్చారు. 2016, నవంబర్ 8న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ చట్టవ్యతిరేకమని, పిటిషన్లు దాఖలు చేసినవారితో ఏకీభవిస్తున్నట్లు ఆమె తన తీర్పలో పేర్కొన్నారు.
ఆర్బీఐలోని సెక్షన్ 26 ప్రకారం.. ఆ సంస్థ వ్యక్తిగతంగా నోట్ల రద్దు సిఫారసు చేసి ఉండాల్సిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సలహా మేరకు డీమానిటైజేషన్ చేయడం సరికాదు అని అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు అంశం చట్టం పరిధిలో జరగలేదని, అది అధికారంతో జరగిందని, అందుకే దాన్ని చట్టవ్యతిరేక నిర్ణయమని అభిప్రాయపడుతున్నట్లు ఆమె వెల్లడించారు.
Advertisement
పెద్ద నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం, జారీ చేసిన ఆదేశాలు సరైన చర్య కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైరాం రమేష్, చిదంబరం అన్నారు. పెద్ద నోట్ల రద్దును ప్రకటించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ యాక్ట్ లోని సెక్షన్ 26 (2)ను సరిగ్గా వర్తింపజేసిందా? లేదా? అనే విషయంపైనే సుప్రీం తీర్పు ఇచ్చిందని, అంతకుమించి ఇంకేమీ ఇందులో లేదని జైరాం రమేష్ తెలిపారు. జస్టిస్ నాగరత్న చేసిన వ్యాఖ్యలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ధర్మాసనంలోని ఓ న్యాయమూర్తి పెద్దనోట్ల రద్దును వ్యతిరేకించారని గుర్తు చేశారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం అసంఘటిత రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని, ఫలితంగా లక్షలాది మంది జీవనోపాధిని కోల్పోయారని విమర్శించారు.
మరోవైపు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్తారా అంటూ కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సెటైర్లు వేశారు. 2016లో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం.. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణను అడ్డుకోవడమే కాకుండా వారి ఆర్థిక మూలాలకు అతి పెద్ద దెబ్బ అని నిరూపితమైందన్నారు. అలాగే, ఆదాయ పన్ను వ్యవస్థ బలోపేతమైందని.. ఆర్థిక వ్యవస్థను పరిశుభ్రం చేసిందని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఊపందుకున్న డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రగామిగా నిలుస్తోందని గుర్తు చేశారు. పెద్దనోట్ల రద్దుపై రాహుల్ తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఇప్పుడేం సమాధానం చెప్తారని అడిగారు.