Advertisement
కొండగట్టు ఆలయానికి అవసరమైతే వెయ్యి కోట్లైనా ఇస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. యాదాద్రి తరహాలో ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. అయితే.. కేసీఆర్ కొండగట్టు టూర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కొండగట్టు భూముల్ని కబ్జా చేస్తారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు ఎటాక్ మొదలు పెట్టారు.
Advertisement
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ.. బండి వ్యాఖ్యలపై ఫైరయ్యారు. కరీంనగర్ నుంచి ఎంపీగా సంజయ్.. నగర అభివృద్ధికి గానీ రాష్ట్ర అభివృద్ధికి గానీ ఒక్క రూపాయి తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో సంజయ్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధితో పాటుగా దేవాలయాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.. దమ్ముంటే బండి సంజయ్ ఇప్పటికైనా కేంద్రం నుంచి నిధులను తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు.
Advertisement
దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని.. అందరికీ తెలుసన్నారు రవిశంకర్. రూ.2 వేల కోట్లతో యాదాద్రిని అభివృద్ధి చేయటం, కొండగట్టును దేశంలోనే అద్భుతమైన హనుమాన్ క్షేత్రంగా తీర్చిదిద్దాలనుకోవడం, వేములవాడ, జోగులాంబ, ధర్మపురి దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం దేవుళ్లను మోసం చేయడం అవుతుందా? అని ప్రశ్నించారు.
జై శ్రీరాం అనే నినాదం దేశ ప్రజలందరిదని.. అది తమదే అన్నట్లుగా బీజేపీ నేతలు మాట్లాడటానికి సిగ్గుండాలన్నారు. మతం, దేవుళ్ల పేరుతో రాజకీయ పబ్బం గడుపుకునే బండి సంజయ్.. ఆయన నియోజకవర్గంలోని ఏ దేవాలయ అభివృద్ధికి ఏన్ని నిధులు తీసుకువచ్చారో చెప్పాలని సవాల్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వంద కోట్లు ఇస్తే.. తాను రెండు వందల కోట్లు తీసుకువస్తానని సంజయ్ చెప్పగలరా అని ప్రశ్నించారు. మతం పేరుతో యువతను ఉన్మాదులుగా మార్చుతున్నది బీజేపీ నాయకులేనని విమర్శించారు రవిశంకర్.