Advertisement
కేంద్రంలోని బీజేపీకి, రాష్ట్రంలోని బీఆర్ఎస్ కి మధ్య యుద్ధం నడుస్తోంది. రోజూ ఏదో ఒక అంశం చుట్టూ ఇరు పార్టీల నేతలు తిట్టుకోవడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను తమపై ఉసిగొల్పుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఈ సమయంలో ఈడీ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
అవును, టీఎస్పీఎస్సీ లీకేజీ అంశంలో ఈడీ రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో నిజానిజాలేంటో తేల్చేందుకు అధికారులు కేసు నమోదు చేశారు. పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఆధారాలతో ఈడీ ఈ కేసు నమోదు చేసింది. పేపర్ లీక్ పై సిట్ తో పాటుగా ఈ అంశంలో ఈడీ కూడా విచారణ చేయబోతుంది. ఎగ్జామ్ పేపర్స్ లీక్ స్కాంలో హవాలా ద్వారా డబ్బుల లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే అరెస్టు అయిన 15 మందిని తిరిగి విచారణ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అవసరమైన పక్షంలో టీఎస్పీఎస్సీ సభ్యులతో పాటు సెక్రెటరీని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Advertisement
మరోవైపు దర్యాప్తులో సిట్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే బోర్డ్ సభ్యులను ప్రశ్నించిన అధికారులు.. చైర్మన్ జనార్ధన్ రెడ్డిని కూడా విచారించింది. దాదాపు మూడున్నర గంటల పాటు ప్రశ్నించిన సిట్.. ఆయన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసింది. ఈ కేసులో జనార్ధన్ రెడ్డి స్టేట్ మెంట్ కీలకం కానుంది. కాన్ఫిడెన్షియల్ రూంలో జరిగే యాక్టివిటీస్ అన్నింటినీ ఛైర్మెన్ నుండి వివరాలు సేకరించింది సిట్ బృందం.
నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ లు ఆఫీస్ లో చేసిన పని తీరు గురించి వివరాలు సేకరించింది. ప్రవీణ్ , రాజశేఖర్ ల ల్యాప్ టాప్ సమాచారాన్ని మరోసారి పరిశీలించింది. ఇక ఇదే కేసులో ముగ్గురు నిందితులను పోలీస్ కస్టడీలోకి అనుమతిచ్చింది నాంపల్లి కోర్టు. ఇటీవల ఆరెస్ట్ అయిన ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యను మూడు రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది.