Advertisement
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తలపెట్టిన భారత్ జోడో యాత్ర తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రవేశించింది. రాహుల్ పాదయాత్ర నేడు కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి ప్రారంభమై అనంతపురం జిల్లా డి.హీరేహళ్ సరిహద్దుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి ఏపీ పీసీసీ చీఫ్ శైలజనాథ్, పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి, ఇతర నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. వాస్తవానికి కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ లోకి ఈ పాదయాత్ర కొనసాగేలా ప్లాన్ చేశారు. కానీ ముందుగానే ఈ పాదయాత్ర ఏపీలోకి ప్రవేశించింది. ఈ పాదయాత్ర కేవలం ఒకరోజు మాత్రమే ఏపీలో కొనసాగనుంది.
Advertisement
ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో కొన్ని ఏరియాలు తమిళనాడు, కర్ణాటకతో సరిహద్దులు కలిగి ఉంటాయి. దీంతో కర్ణాటకలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ బళ్లారి ప్రాంతానికి చేరుకొని పాదయాత్ర చేస్తున్నారు. ఈనెల 17న కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో భారత్ జోడో యాత్ర ఏపీలోకిి ప్రవేశిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణలో రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు అయింది. దీపావళి తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణలోకి అడుగుపెట్టబోతున్నారు. తెలంగాణలో మొత్తం 375 కిలోమీటర్లు పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ డిజైన్ చేశారు. రాహుల్ పాదయాత్ర ఈనెల 31న కర్ణాటక నుంచి కృష్ణానగర్ బ్రిడ్జి మీదుగా తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం లోకి ప్రవేశిస్తుంది.
Advertisement
ఇక మద్నూర్ వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ముందుగా అనుకున్న రూట్ లో కొన్ని మార్పులు చేసి ఫైనల్ రూట్ మ్యాప్ ని ఖరారు చేశారు. దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, చార్మినార్, గాంధీభవన్, నెక్లెస్ రోడ్, బోయిన్ పల్లి, కూకట్ పల్లి, మియాపూర్, పటాన్చెరువు, ముత్తంగి, సంగారెడ్డి, జోగిపేట్, మద్దునూరు వరకు ఈ యాత్ర సాగనుంది. యాత్రపై సమన్వయం చేసేందుకు పార్లమెంటు నియోజక వర్గాల వారీగా ఇన్చార్జిలను నియమించారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. పాదయాత్రని విజయవంతం చేసేందుకు ప్రతీ కార్యకర్త, నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.