Advertisement
ఎవరు ఎంత అప్రమత్తం చేసినా, ఎవరు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా, సోషల్ మీడియా మోసాలు నానాటికి పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలో పెరుగుతున్న మోసాలు వాటి పోలీసులను, ఇటు తల్లిదండ్రులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే, సోషల్ మీడియా సెలెబ్రిటీ హోదా అనుభవిస్తున్న ఒక యువతి దాన్ని అడ్డం పెట్టుకొని, పెళ్లి పేరుతో లక్షలు కొల్లగొట్టిన వ్యవహారం తెరమీదకు వచ్చింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం కు చెందిన పరాస తనుశ్రీ (23) ఇన్స్టాగ్రామ్ లో నాలుగు ఖాతాలను నిర్వహిస్తోంది.
Advertisement
టిక్ టాక్ బ్యాన్ కాకముందు దాంట్లో వీడియోల ద్వారా క్రేజ్ సంపాదించుకున్న తనుశ్రీ టిక్ టాక్ బ్యాన్ కాగానే ఇన్స్టాగ్రామ్ ద్వారా రీల్స్ చేస్తూ, వీడియోలు షేర్ చేసేది. దాంతో ఈ అమ్మడుకి ఎక్కువగా ఫాలోవర్లు వచ్చి పడ్డారు. ఇదే అదునుగా భావించిన ఈ కిలేడీ ఫాలోవర్ల దగ్గర నుంచి సులువుగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసింది. మరో వ్యక్తి పరాశ రవితేజ (32) తో కలిసి తన ప్లాన్ అమలుపరిచింది. తన వీడియోలకు కామెంట్స్ పెట్టే వారికి తిరిగి వ్యక్తిగతంగా రిప్లై లు ఇస్తుండేది తనుశ్రీ. ఈ క్రమంలోనే వారితో పరిచయాన్ని పెంచుకొని, వారిని పెళ్లి చేసుకుంటాను అంటూ వలపు వల విసిరేది.
Advertisement
తన అందానికి ఫిదా అయినా కొందరు ఫాలోవర్లు, తనుశ్రీ చెప్పే మాటలు నమ్మి తను అడిగినంత డబ్బులు పంపించేవారు. ఇలా హైదరాబాదుకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం పెంచుకొని పెళ్లి దాక తీసుకొచ్చింది ఈ కిలేడి. అనంతరం తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి పలు దఫాలుగా ఎనిమిది నెలల్లో ఏకంగా రూ. 31.6 లక్షలు వసూలు చేసింది. అనంతరం కొన్ని రోజుల తర్వాత తనుశ్రీ మోసం చేసింది అని తెలుసుకున్న యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు తనుశ్రీని, రవితేజను అరెస్టు చేశారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీబీ హరినాథ్ తెలిపారు. సులువుగా డబ్బు సంపాదించాలి అనే ఆలోచనతోనే తన అందాన్ని పెట్టుబడిగా పెట్టి ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.