Advertisement
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతోంది. లోకేష్ పాదయాత్రతో జనంలోనే ఉంటున్నారు. ఇటు చంద్రబాబు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలపై వారు విరుచుకుపడుతున్నారు. వాటికి జగన్ సేన కూడా ధీటుగా బదులిస్తోంది. ఈ నేపథ్యంలో డైలాగ్ వార్ తారస్థాయిలో కొనసాగుతోంది.
Advertisement
శుక్రవారం రాత్రి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబుపై రాళ్లదాడి జరిగింది. చంద్రబాబు ఎర్రగొండపాలెం వస్తున్న సమయంలో ముందస్తుగానే ఘర్షణలకు కుట్ర చేశారన్న కొన్ని వీడియోలను టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మంత్రి సురేష్ పోలీసులను ఆదేశిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. చంద్రబాబుకు తగిన భద్రత కల్పించడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఎన్‌ఎస్‌జీ రక్షణలో ఉన్న చంద్రబాబుపై రాళ్ళ దాడి ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖకు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. వీఐపీ భద్రతకు సంబంధించి స్థానిక పోలీసులు స్టాండింగ్ ఆర్డర్లను ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో జరిగిన సంఘటనలు కూడా లక్ష్మీనారాయణ లేఖలో పేర్కొన్నారు. ఆందోళనకారులు దాడికి ముందుగా సిద్ధమైనప్పటికీ వారిని స్థానిక పోలీసులు నిరోధించకపోవడం పట్ల అభ్యంతరం తెలియజేశారు. ఇటు చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి ఘటనను ఎన్‌ఎస్‌జీ హెడ్ క్వార్టర్స్ సీరియస్ గా తీసుకుంది.
Advertisement
మరోవైపు టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చంద్రబాబు దళితుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు చేశారు మంత్రి సురేష్. తాము రాళ్ల దాడి చేయలేదని ప్రమాణం చేయడానికి సిద్ధం.. టీడీపీ నేతలు వస్తే కాణిపాకం ఆలయానికి వెళ్లి ప్రమాణం చేద్దామని సవాల్ చేశారు. నిరసన ప్రాంతానికి చేరుకున్న సమయంలో దళిత నేతలను చంద్రబాబు వేలు చూపించి బెదిరించారని.. అల్లరి మూకలను తమ మీదకు ఉసిగొల్పారని ఆరోపించారు. కారంచేడు, చుండూరు లాంటి మరో మారణహోమం సృష్టించాలనుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
మంత్రి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫైరవుతున్నారు. ఆదిమూలపు సురేష్ సురేష్ ఏనాడైనా దళితుల గురించి పోరాడారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి జవహర్. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతుంటే కనీసం పట్టించుకోని సురేష్ కు వారి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అర్ధ నగ్న ప్రదర్శన చేయాల్సంది తాడేపల్లి ప్యాలెస్ ముందు అని పేర్కొన్నారు. మంత్రి సురేష్ దగ్గరుండి వైసీపీ కార్యకర్తలను చంద్రబాబు కాన్వాయ్ పైకి ఉసిగొల్పారన్నారు ఎంపీ కేశినేని నాని. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దాడులను టీడీపీ ధైర్యంగా ఎదుర్కొంటుందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా వైసీపీకి చెల్లిస్తామని హెచ్చరించారు కేశినేని.