Advertisement
ఈమధ్య ప్రభుత్వ హాస్టల్స్, స్కూల్స్ లో ఫుడ్ పాయిజన్ జరగడం.. అస్వస్థకు గురవ్వడం తరచూ జరుగుతున్నాయి. అయితే.. కస్తూర్బా కాలేజీలో పలువురు విద్యార్థినులు సొమ్మసిల్లి పడిపోవడం మిస్టరీగా మారింది. ఈ ఘటన హైదరాబాద్ లోని సికింద్రాబాద్ మారేడ్ పల్లిలో చోటు చేసుకుంది. ల్యాబ్ లో కెమికల్ గ్యాస్ లీక్ కావడంతోనే విద్యార్థినులు పడిపోయారని అంటున్నారు.
Advertisement
విద్యార్థులు ల్యాబ్ లో ప్రయోగాలు చేస్తుండగా ఇది జరిగిందని అనుకుంటున్నారు. వెంటనే స్పందించిన కాలేజీ యాజమాన్యం విద్యార్థినులను స్థానిక ఆసుపత్రికి తరలించింది. ఘాటు వాసన కారణంగా కొందరు స్టూడెంట్స్ అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. 8 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థత చెందారు. మొత్తం 41మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవడం కలకలం రేపింది.
Advertisement
ప్రస్తుతం విద్యార్థినులకు చికిత్స అందుతోంది. విషయం తెలిసిన విద్యార్థునుల తల్లిదండ్రులు హాస్పిటల్ వద్దకు పరుగులు పెట్టారు. తమ బిడ్డల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఏం జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డారు. విద్యార్థినులు ఎందుకు అస్వస్థతకు గురయ్యారనే అంశం అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
మొదట కాలేజీ సైన్స్ ల్యాబ్ నుంచి గ్యాస్ లీక్ అయిందని ప్రచారం సాగింది. కానీ, యాజమాన్యం మాత్రం అసలు సైన్స్ ల్యాబ్ ఓపెన్ చేసే లేదని చెబుతోంది. బయటి నుంచి వచ్చిన గ్యాస్ వల్లే విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారని అంటోంది. క్లూస్ టీమ్ తో పోలీసులు కాలేజీ పరిసరాలతోపాటు ల్యాబ్ పరిశీలించారు. యాజమాన్యం, విద్యార్థినులతో మాట్లాడి వివరాలు సేకరించారు. గ్యాస్ ఎక్కడి నుంచి లీక్ అయ్యింది? విద్యార్థినులు ఎలా స్పృహ తప్పి పడిపోయారనే అంశాలపై ఆరా తీస్తున్నారు.