Advertisement
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గందరగోళం నడుమ కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు, జగన్ ఢిల్లీ టూర్ పై సమాధానం కావాలని నిరసనకు దిగుతోంది. సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. 2023-24 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ను ఇప్పటికే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వైసీపీ నాయకుల హర్షద్వానాల మధ్య, టీడీపీ సభ్యుల నిరసనల మధ్య రూ.2.79 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను ప్రతిపాదించారు.
Advertisement
ఓవైపు సమావేశాలు కొనసాగుతుండగా.. ఇంకోవైపు జగన్ ఢిల్లీలో మోడీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదీగాక, వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమైంది. ప్రభుత్వ వర్గాల ప్రకారం రాష్ట్ర విభజన సమస్యలపై మోడీతో జగన్ చర్చించారని అంటున్నారు. కానీ, కథ వేరే ఉందనేది ప్రతిపక్షాల వాదన.
Advertisement
అసెంబ్లీలో జగన్ టూర్ పై నిరసనకు దిగింది టీడీపీ. సభ ప్రారంభం కాగానే ఆందోళన చేపట్టింది. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. జగన్ ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. టూర్ వివరాలు సభ ముందు ఉంచాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. చాలా సార్లు సీఎం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలిసినా ఆ విషయాలు ప్రజలకు చెప్పడం లేదని, అంత రహస్యమేంటని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యేలు.
టీడీపీ నేతల నిరసనపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సీరియస్ అయ్యారు. సీఎం ఢిల్లీ పర్యటనపై వాయిదా తీర్మానం ఇస్తారా.. అసలు వాయిదా తీర్మానం అర్ధం తెలుసా అంటూ ఫైరయ్యారు. అచ్చెన్నాయుడు అడిగినందుకే ఆదివారం కూడా సభ పెట్టామని.. గతంలో చంద్రబాబు 35 సార్లు ఢిల్లీ వెళ్లారని.. ఆ 35 సార్లు చర్చించి తరువాత జగన్ ఢిల్లీ పర్యటనపై చర్చిద్దామా అంటూ సవాల్ విసిరారు. దానికి తాము సిద్ధమే అంటూ టీడీపీ సభ్యులు ప్రతి సవాల్ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఇటు ఏపీ అసెంబ్లీ ప్రారంభానికి ముందు సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద ఇదే ఇష్యూపై టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు.