Advertisement
తెలంగాణలో అధికారం దక్కించుకోవాలన్నది బీజేపీ కల. ఈసారి అది తప్పకుండా నెరవేరుతుందని ఎంతో ఆశతో ఉన్నారు నేతలు. అధిష్టానం కూడా ఫుల్ హ్యాండ్ ఇవ్వడంతో రాష్ట్ర నాయకత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. అయితే.. తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ అయి కీలక వ్యాఖ్యలు చేశారు.
Advertisement
శనివారం రాత్రి తెలంగాణకు వచ్చిన అమిత్ షా కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఆదివారం సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక వేడుకల్లో అమిత్ షా కీలక ప్రసంగం చేసారు. గతంలో ఈ ఉత్సవాలు న్యూఢిల్లీలోనే జరిగేవి. ఢిల్లీ వెలుపల ఈ ఉత్సవాలు జరగడం ఇదే మొదటిసారి. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, దేశ వ్యతిరేక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేసే వైఖరిని రానున్న రోజుల్లోనూ కొనసాగిస్తామని స్పష్టం చేసారు. సురక్షితమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందదని చెప్పారు అమిత్ షా.
Advertisement
తెలంగాణ పర్యటన తర్వాత ఆయన కేరళకు వెళ్లాల్సి ఉండగా.. ప్రత్యేక విమానంలో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది. షెడ్యూల్ ప్రకారం కొచ్చి వెళ్లాల్సిన షా.. విమానంలో సమస్య తలెత్తటంతో ఎన్ఐఎస్ లోనే చాలాసేపు ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే బీజేపీ నేతలతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తో సమావేశమయ్యారు షా. రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు.
తెలంగాణ రాజకీయాలపై బండి సంజయ్.. అమిత్ షాకు ఒక నోట్ అందించినట్టు సమాచారం. సంజయ్ అందించిన నోట్ పై లోతైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, నేతలు మరింత కలిసికట్టుగా పనిచేస్తే అధికారం తథ్యమని చెప్పినట్టు సమాచారం. రాష్ట్ర నేతల పనితీరుకు కితాబు ఇచ్చిన అమిత్ షా.. చేరికలపై దృష్టి పెట్టాలని సూచించినట్టు వార్తలు వస్తున్నాయి.