Advertisement
ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య కొన్నాళ్లుగా పంచాయితీ నడుస్తోంది. ఆమధ్య గవర్నర్ తమిళిసై ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిసి ప్రోటోకాల్ విషయంలో కంప్లయింట్ చేయడం.. టీఆర్ఎస్ నేతలు కూడా ధీటుగా బదులివ్వడంతో ఇది ఎటు దారితీస్తుందో అని అంతా అనుకున్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. దీంతో అంతా సర్దుకుందని వార్తలు వచ్చాయి. కానీ, మళ్లీ మొదటికొచ్చింది. ప్రోటోకాల్ విషయంలో అదే సీన్ ఎదురైంది. దీంతో గవర్నర్ కూడా అన్ని విషయాలపై దృష్టిసారించారు. తన పరిధిలోని అన్ని విషయాలను గుచ్చి గుచ్చి అడగడం మొదలుపెట్టారు.
Advertisement
రెండు రోజుల క్రితం యూనివర్సిటీల రిక్రూట్ మెంట్ ఉమ్మడి బోర్డు అంశంపై పలు ప్రశ్నలు సంధిస్తూ.. వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై మంత్రి సబిత కలగజేసుకుని గవర్నర్ తీరుపై మండిపడ్డారు. తనకెలాంటి లేఖ రాలేదన్నారు. దీంతో రాజ్ భవన్ కూడా అదే రీతిలో కౌంటర్ ఇచ్చింది. మెసెంజర్ ద్వారా మెసేజ్ పంపామని స్పష్టం చేసింది. ఆ తర్వాత మంత్రి కూడా లేఖ అందిందని.. గవర్నర్ అపాయింట్ మెంట్ కోరామని ప్రకటించారు. ఈ పంచాయితీ నడుస్తుండగానే తమిళిసై మీడియా ముందుకొచ్చారు. ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు.
Advertisement
తాను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాననడం ఆశ్చర్యంగా ఉందన్నారు తమిళిసై. ప్రభుత్వం వద్ద నుంచి తన వద్దకు బిల్లులు వచ్చాయని.. వాటిని పరిశీలిస్తున్నామని తెలిపారు. సీఎంవో నుంచి మంత్రికి లేఖ వెళ్లడానికి జాప్యమైతే సమస్యలు ప్రగతి భవన్ కి ఎలా చేరుతాయని ప్రశ్నించారు. తనకు ఎలాంటి భేషజాలు లేవని బిల్లుల్ని తానే ఆపానని తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కో బిల్లును కూలంకషంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. కొత్త రిక్రూట్ మెంట్ బోర్డు అంశంలో క్లారిటీ కావాలని అడిగానని.. దానికే తానేదో బిల్లును ఆపానని ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారేమో అని అనిపిస్తోందని అన్నారు తమిళిసై. తద్వారా ప్రైవసీకి భంగం కలుగుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో అప్రజాస్వామిక చర్యలు కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల విషయంలో తాను సానుకూలంగా స్పందిస్తానని పేర్కొన్నారు. ఫాంహౌస్ కేసులోనూ రాజ్ భవన్ ను లాగాలని చూశారని తుషార్ గతంలో తన ఏడీసీగా పని చేశారని, అంత మాత్రాన రాజ్ భవన్ ను ఈ కేసులోకి లాగుతారా? అని ప్రశ్నించారు. రాజ్ భవన్ ముందు ఆందోళన చేస్తామని జేఏసీ హెచ్చరిస్తోందని.. వారిని ఎవరు రెచ్చగొడుతున్నారని నిలదీశారు. ప్రగతి భవన్ లాగా రాజ్ భవన్ గేట్లు మూసివేయలేదని అన్నారు. ఎవరొచ్చినా మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు గవర్నర్.