Advertisement
ఎమ్మెల్యేల ఎర కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని నిందితులు వేసిన పిటిషన్ పై సంచలన తీర్పునిచ్చింది హైకోర్టు. కేసును సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగిలినట్లేనని టాక్ నడుస్తోంది. ఈ కేసుతో బీజేపీని టార్గెట్ చేసుకొని జాతీయ రాజకీయాల్లో మైలేజ్ పొందేందుకు కేసీఆర్ పెద్ద స్కెచ్చే వేశారని.. ఇప్పుడు కేసు సీబీఐకి ఇస్తే అంతా తారుమారు అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు.
Advertisement
ఈ కేసును సీబీఐకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ను రద్దు చేసిన న్యాయస్థానం.. తక్షణమే దాన్ని సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. సిట్ వద్ద ఉన్న వివరాలు, ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తునకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే.. ఈ తీర్పును వెంటనే అమలు చేయొద్దంటూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
Advertisement
కేసుకు సంబంధించి తీర్పు ఫైనల్ కాపీ వచ్చే వరకు ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయకుండా చూడాలని కోరింది. అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తిని పరిశీలించిన కోర్టు ఫైనల్ కాపీ వచ్చే వరకు జడ్జిమెంట్ ను సస్పెన్షన్ లో ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కేసుపై పిటిషనర్ల తరఫున మహేశ్ జఠ్మలానీ, సిట్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.
నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని మొదట కేసు నమోదైంది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించారు. అనంతరం ఈ కేసును సిట్ కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొందరు నేతలకు నోటీసులు పంపారు కానీ, విచారించలేకపోయింది. పైగా సిట్ దర్యాప్తుపై విచారణకు హాజరైన వారంతా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో నిందితుల అభ్యర్థన మేరకు సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం.. కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.