Advertisement
దేశంలోని 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వచ్చారు. ఇందులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్ కూడా ఉంది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణ మాథూర్ లు తమ పదవులకు రాజీనామా చేయగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆ వెంటనే కొత్త గవర్నర్ల ప్రకటన వచ్చింది.
Advertisement
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్ గఢ్ కు పంపి.. ఆయన స్థానంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ అబ్దుల్ నజీర్ ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా నియమించారు. అయితే.. గవర్నర్ల నియామకంపై కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. ప్రధాని మోడీ కోసం పని చేసిన మాజీ న్యాయమూర్తులు.. గవర్నర్లు అయ్యారని విమర్శించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నియామకాన్ని ప్రస్తావించింది.
Advertisement
అయోధ్య రామమందిరం కేసుతో పాటు ట్రిపుల్ తలాక్ కేసు, డీమానిటైజేషన్ కేసు వంటి వాటిలో నజీర్ లోగడ తీర్పులిచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు. రిటైర్మెంట్ కి ముందు జడ్జీలు ఇచ్చే తీర్పులు ఆ తరువాత వారి జాబ్స్ ని ప్రభావితం చేస్తాయంటూ దివంగత అరుణ్ జైట్లీ 2012లో చేసిన కామెంట్స్ కు సంబంధించిన వీడియోను తన ట్వీట్ కి జోడించారు జైరామ్ రమేష్.
గత మూడు నాలుగేళ్లుగా ఇలా జరుగుతోందనడానికి తగినన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. అయితే.. బీజేపీ నేత బీఎల్ సంతోష్ దీన్ని ఖండిస్తూ రిటైర్డ్ జడ్జి అబ్దుల్ నజీర్ నియామకాన్ని తప్పు పట్టడం హేయమన్నారు. శ్రీరామ్ జన్మభూమి కేసులో తీర్పు ఇవ్వడమే ఆయన పాపమైందా అని సంతోష్ తిప్పికొట్టారు.